కరీంనగర్ అర్బన్: అసలే ఎండాకాలం.. ఆపై 42 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఉదయం 9దాటిందంటే బయట అడుగుపెట్టలేని పరిస్థితి. అత్యవసర పరిస్థితని బయటకెళితే తడారే గొంతు. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీలో డీలర్ల పాట్లు వర్ణనాతీతం. ఉష్ణోగ్రతల క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారి నిర్వాకంతో డీలర్ల పడిగాపులు.. ముంచుకొస్తున్న గడువుతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. నిప్పుల కొలిమిలో రేషన్ దుకాణానికి కార్డుదారులు ఆశగా రావడం, బియ్యం లేవని డీలర్ చెప్పే సమాధానంతో నిరాశగా వెనుదిరగడం తంతుగా మారింది. కేవలం ప్రణాళిక లేమి.. ఒంటెద్దు పోకడే ఇందుకు నిదర్శనమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదాం అధికారి తీరును నిరసిస్తూ శనివారం గోదాం వద్ద డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికీ 60శాతమే రవాణా
కరీంనగర్ ఎంఎల్‌ఎస్ పాయింట్ కింద 218 రేషన్ దుకాణాలున్నాయి. దుకాణం సంఖ్య, కేటాయించే రేషన్ బియ్యం క్రమంలో ముందస్తు ప్రణాళిక అత్యవసరం. కరీంనగర్ అర్బన్‌తో పాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు మండలాల్లోని రేషన్ దుకాణాలకు ఇక్కడి నుంచే రవాణా చేయాల్సి ఉంటుంది. ఒక్కో దుకాణానికి గరిష్టంగా 400 క్వింటాళ్ల వరకు బియ్యం రవాణా చేయాల్సి ఉంటుంది. నేటికి 60శాతం మాత్రమే మూవ్‌మెంట్ పూర్తవగా కొన్ని దుకాణాల్లో 50శాతం కూడా మూవ్‌మెంట్ కాలేదని తెలుస్తోంది.
మరో 11రోజులే గడువు
ఒక్కో కార్డుదారుకు రేషన్ పంపిణీ చేయాలంటే మూడు సార్లు వేలిముద్ర తీసుకుంటుండగా సదరు ప్రక్రియకు 20– 25నిమిషాలు పడుతోంది. ఒక్కో రోజుకు 20మందికి మించి పంపిణీ చేసే పరిస్థితి లేదని డీలర్లు వాపోతున్నారు. 3నెలల బియ్యం కావడంతో ఈ నెలాఖరు వరకు పంపిణీకి గడువిచ్చినప్పటికీ మూవ్‌మెంట్ పరిస్థితిని పరిశీలిస్తే సదరు గడువు సరిపోదని స్పష్టమవుతోంది. గోదాం అధికారి తెలిసినవారికే బియ్యం సరఫరా చేస్తుండగా, ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్ల సంఘం రూట్ ప్రోగ్రాం ఇచ్చినా సదరు ప్లాన్‌ను అమలు చేస్తే ఏ సమస్య ఉండేది కాదు. సొంత ఎజెండాతో మూవ్‌మెంట్ చేస్తుండగా సమస్య మరింత జటిలమవుతోంది. దుకాణంలో బియ్యం పంపిణీ చేయాల్సిన రేషన్ డీలర్లు నిత్యం గోదాం చుట్టూ తిరగడం ఆందోళనకర పరిణామం.
ఓ పద్ధతి లేదు.. ప్రణాళిక లేదు
గోదాం అధికారి నియంతృత్వ విధానం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది. మండుతున్న ఎండలో ప్రాణాలకు తెగించి బియ్యం పంపిణీ చేస్తుంటే యుద్ధప్రతిపాదికన బియ్యం రవాణా చేయాల్సి ఉండగా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందరం పనిచేసేది కార్డుదారుల కోసమే కదా.. ఇదేం పద్ధతి.
– రొడ్డ శ్రీనివాస్, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు


