‘అన్నల’ ఆనవాళ్లు ! | - | Sakshi
Sakshi News home page

‘అన్నల’ ఆనవాళ్లు !

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

మూడు దశాబ్దాల కిందటే పనులు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి బాటలు

మౌలిక వసతులకు నక్సలైట్ల శ్రీకారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో వినూత్న పనులు

సనుగులలో ఎన్నెన్నో పనులు

చందుర్తి మండలం సనుగులలో జనశక్తి నక్సలైట్ల ప్రోద్బలంతో గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) అనేక పనులకు శ్రీకారం చుట్టారు. కూడలిలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, బస్‌షెల్టర్‌ను నిర్మించారు. పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవడంలో, ప్రైవేటుగా టీచర్లను నియమించి జీతాలు ఇవ్వడం, ఏకంగా రెండు ప్రైవేటు బస్సు సర్వీసులను కొనుగోలు చేసి ఊరి ప్రజలకు ప్రయాణ వసతిని కల్పించారు. ఆ బస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లీ గ్రామాభివృద్ధికి వినియోగించారు. రోడ్డు వేయాలన్నా.. శ్రమదానంతో గ్రామస్తులను ముందుకు కదిలించారు. సనుగుల శివారులోని ఎర్రచెరువు పటేల్‌ చెరువు ఆధునీకరణ పనులను వీడీసీ ఆధ్వర్యంలో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి విద్యాసాగర్‌రావు నిధులతో నక్సలైట్లు పనులు చేయించారు.

అనేక గ్రామాల్లో బస్‌షెల్టర్లు, విగ్రహాలు, చేతిబోర్లు

సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి నక్సలైట్ల ప్రాబల్యమున్న జిల్లాలోని కోనరావుపేట, చందుర్తి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులను నక్సలైట్ల ఆధ్వర్యంలో చేపట్టారు. చందుర్తి మండలం లింగంపేట, కట్టలింగంపేట, రామారావుపల్లెల్లో బస్‌షెల్టర్ల నిర్మాణం, కోనరావుపేట మండలం బావుసాయిపేట, మల్కపేట, శివంగాళపల్లె వంటి గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అనేక అటవీ గ్రామాల్లో దాహార్తి తీర్చేందుకు బోర్లు వేయించి, మోటార్లు అమర్చారు. పలు పల్లెలకు రోడ్లు వేయించారు. 1990 నుంచి 2005 వరకు ప్రజల భాగస్వామ్యంలో అభివృద్ధి పనులకు బాటలు వేశారు.

బహిరంగ రహస్యం.. తెరవెనుక ‘అన్నలు’

గతంలో కోనరావుపేట మండలం బావుసాయిపేట హైస్కూల్‌కు స్థలం లేదు. దీంతో ఊరికి చెందిన భూయజమాని తన భూమిని అమ్ముకునేందుకు సిద్ధపడగా.. స్కూల్‌కు మూడెకరాలు ఉచితంగా అప్పగించి మిగతా భూమిని అమ్ముకోవాలని నక్సలైట్లు సూచించారు. దీంతో సదరు భూమి యజమాని మూడెకరాలను స్కూల్‌కు విరాళంగా అందించారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.కోటిపైగా ఉంటుంది. బావుసాయిపేటలో హైస్కూల్‌ ఏర్పాటుతోపాటు తెలంగాణ క్రీడాప్రాంగణం ఏర్పాటైంది. అంతకుముందు బస్టాండు విస్తరణలోనూ నక్సలైట్లు కీలకపాత్రను పోషించారు. ఇలా అంతా బహిరంగ రహస్యంగా తెరవెనుక శ్రీఅన్నలుశ్రీ ఉండి అనేక పనులు చేయించారు. కోనరావుపేట మండలం మరిమడ్లలో ప్రభుత్వం సేకరించిన రూ.60 లక్షల విలువైన తునికాకును రహస్యంగా నక్సలైట్లు అమ్మేసి ఆ డబ్బును గ్రామాల అభివృద్ధికి వినియోగించారు.

చెరువుల నిర్మాణం

జిల్లాలో చిన్న చిన్న పనులే కాదు.. ఏకంగా గండిపడిన చెరువులను పునర్‌ నిర్మాణంలో నక్సలైట్ల పాత్ర మరువలేనిది. వీర్నపల్లి మండలంలోని రంగంపేట మార్గండి(జంపన్న) చెరువును జనశక్తి నక్సలైట్లు ప్రజల సహకారంతో నిర్మించారు. యంత్రాలను నక్సలైట్లు సమకూర్చగా.. ప్రజలను స్వచ్ఛందంగా కులాల వారీగా చెరువుకు శ్రమదానం చేశారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల నారాయణచెరువు గండి కూడా నక్సలైట్ల ఆధ్వర్యంలో పూడ్చారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల చెరువును సైతం నక్సలైట్ల పర్యవేక్షణలో పూర్తి చేశారు. ఇలా జిల్లాలో సాగు, తాగునీరు, రోడ్డు, మౌలిక వసతుల కల్పనలో సాయుధ నక్సలైట్లు భాగస్వాములు కావడం విశేషం.

సిరిసిల్ల: రాష్ట్రంలో నక్సలిజం అంతమైందని, సాయుధ పోరాటం ఆగిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు పెద్దలు ఇటీవల ప్రకటించారు. సాయుధ నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో రాష్ట్రంలో నక్సలైట్ల కదలికలు సద్దుమణిగాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మూడు దశాబ్దాల కిందట నక్సలైట్లు ప్రజల భాగస్వామ్యంతో అనేక అభివృద్ధి పనులు చేయించారు. నక్సలైట్లు అంటే.. బస్సులను కాల్చివేస్తారు. టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీలను పేల్చివేస్తారు.. ఇన్‌ఫార్మర్లు అంటూ.. హత్యలు చేస్తారు.. ప్రభుత్వంపై నిరసన పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారు.. అని తరచూ వింటుంటాం. కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. శ్రీఅన్నలుశ్రీ కూడా అభివృద్ధికి బాటలు వేస్తారని రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిరూపించారు. మూడు దశాబ్దాల క్రితం నక్సలైట్ల ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనుల జాడలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

Advertisement
 
Advertisement
Advertisement