ఉమ్మడి జిల్లాలో ఇలా..
కరీంనగర్: కాలేయం (లివర్).. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఆహారం జీర్ణమై చివరికి పిండి పదార్థాలుగా, కొవ్వు ఆమ్లాలుగా, ప్రోటీన్లుగా మారి రక్తంలో కలవాలంటే ఇది సక్రమంగా పని చేయాలి. అయితే మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల లివర్ అనారోగ్యానికి గురవుతోంది. హెపటైటిస్ బీ, సీ వైరస్‌ల వల్ల కూడా పాడవుతోంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్‌గా మారితే రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేసి కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేయించుకోవాలి. దానం చేసేవారు కూడా అందుబాటులో ఉండాలి లేదా బ్రెయిన్‌డెడ్ అయి అవయవదానం చేసేవారు ఉండాలి. లేకుంటే ప్రాణాలు పోతాయి. ఈ పరిస్థితిని గుర్తించి ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఏప్రిల్ 19న కాలేయ దినోత్సవంగా ప్రకటించింది. కాలేయం శరీరంలో మెదడు తర్వాత అతి ప్రధానమైన అవయవం. రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో సాయపడటం, విటమిన్ డీని శరీరానికి అందేలా చూడటం, చక్కెర స్థాయిని సమతుల్యం చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, ఖనిజ లవణాలు, విటమిన్లను నిల్వ చేయడం లాంటి పనులు చేస్తోంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే హెపటైటీస్, సిర్రోసిస్, కామెర్లు, కేన్సర్ లాంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల లివర్‌ను మంచి ఆహారపు అలవాట్లతో కాపాడుకోవాలి.
ఆల్కహాల్‌తో పాటు కల్తీ ఆహారం డేంజర్
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారికే లివర్ సమస్యలు వస్తుంటాయని ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. ఆల్కహాల్‌లో 50 శాతం లివర్ సమస్యలు వస్తే కల్తీ ఆహారంతో మరో 50 శాతం సమస్యలు వస్తుంటాయి. ఆల్కహాల్ అలవాటు లేని వారు కూడా లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. వీరంతా జంకుఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, రోడ్‌సైడ్ ఫుడ్ ముఖ్యంగా పానీపూరీ లాంటివి తినడం చాలా డేంజర్. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పులు, పాలు తీసుకుంటే మంచిది. మితంగా భుజించాలి. లివర్ సమస్యలకు ఊబకాయం కూడా ఒక కారణం. ఒబేసిటీ ఉన్న వారికి ప్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్, బీపీ ఉన్నవారు అప్పుడప్పుడూ లివర్ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహాలు పాటించాలి.
ఊబకాయం, ఆహార అలవాట్లు, జీవనశైలితో ముప్పు
ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షల మందికి ఏదో ఒక రకమైన సమస్య
హెపటైటిస్ బీ, సీ వైరస్‌లతో మరింత డ్యామేజీ
నేడు వరల్డ్ లివర్ డే
ఉమ్మడి జిల్లాలో సుమారు 36 లక్షల జనాభా ఉండగా అందులో వివిధ రకాల కాలేయ సమస్యలతో బాధపడేవారు దాదాపు 3.5 లక్షల మంది ఉన్నట్లు అంచనా. అతిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, కుర్చీలకు పరిమితమై పనులు చేస్తున్న వారికి ఊబకాయం వస్తోంది. ఇలా ఉన్న వారిలో ప్యాటీ లివర్ సమస్యలున్నాయి. ఇది ఉన్నట్టు చాలా మందికి తెలియదు. తక్కువ మందిలో జన్యుపరమైన అంశాలు కూడా ప్యాటీ లివర్‌కు కారణమవుతున్నాయి. స్కానింగ్ చేయించుకుంటేనే సమస్య తెలుస్తుంది.


