● రోడ్డు ప్రమాదంలో అర్చకుడు మృతి
● నిత్య పూజలు చేసి వస్తుండగా ఘటన
● గుండెలవిసేలా రోదించిన కుటుంబసభ్యులు
జ్యోతినగర్(రామగుండం): ‘అయ్యో.. భగవంతుడా నిత్య పూజలు చేశాము కదయ్యా.. నువ్వు మాకు ఇలా చేశావు దేవుడా..నీకు ఏమి అపకారం చేశామయ్యా.. మాపై కనికరం లేకుండా చేశావు తండ్రి’ అంటూ దేవునిపల్లి ఆలయ అర్చకుడి కుటుంబసభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్, కటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోదావరిఖని గౌతమినగర్‌లో నివసిస్తున్న తిరునహరి సంతోష్‌కుమార్(43) పెద్దపల్లి మండలం అందుగులపల్లె సమీపంలోని దేవునిపల్లి నరసింహస్వామి ఆలయంలో పూజారి. శనివారం దేవునికి పూజలు చేసి ద్విచక్రవాహనంపై గోదావరిఖని వస్తుండగా ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ రాజీవ్ రహదారిపై బూడిద ట్యాంకర్ ఢీకొంది. 30 మీటర్లు అతడిని ట్యాంకర్ వెనక టైరు ఈడ్చుకెళ్లడంతో శరీరం పూర్తిగా ఛిద్రమైంది.
పోలీసుల విచారణ..
ఎన్టీపీసీ ఎస్సై తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని టిప్పర్ టైరుకింద నలిగిపోయిన సంతోష్‌కుమార్ మృతదేహాన్ని స్థానిక మెకానిక్‌లు షారూక్, అస్లాం, పాషా సహకారంతో బయటకు తీశారు. మృతుడి బావ ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్ల డించారు. ఘటన స్థలాన్ని రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్ సందర్శించారు. కాగా, ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ప్రమాదం జరిగి సంతోష్‌కుమార్ మృతి చెందాడని కాంట్రాక్టు కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ ఆరోపించారు. గతంలో చాలా ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బంది నియమించాలని కోరారు.


