నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్‌కే రేషన్ బియ్యం
అధికారులు, మిల్లర్ల మిలాఖత్
రూ.కోట్లలో ప్రజాధనం వృథా
ఉమ్మడి కరీంనగర్‌లోని ఓ జిల్లాలో భారీ దందా
కరీంనగర్ అర్బన్: అక్రమ ఆదాయానికి రుచిమరిగిన మిల్లర్లకు పలువురు అధికారులు తోడవడంతో రేషన్ దందా భారీగా సాగుతోంది. ప్రత్యేక బృందాల కళ్లుగప్పి వ్యాపారం వర్ధిల్లుతోంది. ఒక్కో ఏసీకేకు రూ.లక్షల్లో ముడుపులు చేరుతుండటంతో దందా సాఫీగా జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్‌లోని ఓ జిల్లాలో పలువురు అధికారులు, రేషన్ దందాలో ఆరితేరిన మిల్లర్లు కొత్త పథకానికి తెరదీసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు చేర్చి అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఎఫ్‌సీఐ పరిశీలన, పరీక్షలు లేకుండానే పంపిస్తున్నారు. అంటే రీసైక్లింగ్ అన్న మాట. లబ్ధిదారులు, రేషన్ డీలర్లు అమ్మిన బియ్యమే మళ్లీ కార్డుదారులకు చేరుతోంది. దీనివెనుక రైస్‌మిల్లర్ల సంఘం నేతలు చక్రం తిప్పుతుండగా అధికారులకు లక్షల్లో మామూళ్లు చెల్లిస్తున్నారు.
నిబంధనలకు మంగళం
సీఎంఆర్ ధాన్యాన్ని మరాడించి మిల్లర్లు రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులకు చేర్చాలి. ఇచ్చిన ధాన్యానికి నిర్దేశిత లక్ష్యం మేరకు బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ అధికారులు బీఆర్‌ఎల్ టెస్ట్(ఏజ్ టెస్ట్) చేసి తాజా బియ్యమైతేనే ధ్రువీకరిస్తారు. ఒకవేళ పాత బియ్యమైతే టెస్ట్‌లో కలర్ మారిపోతుంది. ఎఫ్‌సీఐ అధికారుల ఫిజికల్ వెరిఫికేషన్(పీవీ) ఉంటుంది. తాజా మిల్లింగ్ బియ్యమని తేల్చిన తరువాత స్టేజ్–1 నుంచి స్టేజ్–2(ఎంఎల్‌ఎస్ పాయింట్)కు బియ్యాన్ని తరలించాలి. అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేయడం తదుపరి కార్డుదారులకు పంపిణీ జరుగుతోంది.
అక్రమాలకు పెద్దపీట
నిబంధనలను విస్మరించిన మిల్లర్లు అధికారుల అండతో అక్రమాలకు బరితెగించారు. గత కొన్ని నెలలుగా దందా సాగుతుండగా పౌరసరఫరాల శాఖలో పలువురు అధికారులు అక్రమార్కులకు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఎఫ్‌సీఐ తనిఖీలు చేస్తే అసలు రంగు బయటపడుతుందని భావించిన మిల్లర్లు అధికారుల సలహాతో నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్‌కే తరలిస్తున్నారు. వేల క్వింటాళ్లలో కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు సరఫరా చేస్తున్నారు. సదరు వ్యవహారమంతా పౌరసరఫరాల అధికారుల కనుసన్నలో సాగుతుండటంతో అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నేరుగా తీసుకెళ్లే బియ్యానికి సదరు శాఖలోని పలువురు అధికారులే సీఎంఆర్ బియ్యమని కాగితాలు సృష్టిస్తుండటంతో తనిఖీలు చేసినా దొరికే అవకాశమే లేదు. ఇక పాత బకాయిలకు సంబంధించి ఓల్డ్ డిఫాల్టర్లకు రారైస్ బియ్యం పెట్టమని అవకాశమిస్తే పలువురు విచ్చలవిడిగా రేషన్ దందా నిర్వహిస్తున్నారు.
మిల్లర్లకు డబుల్ ధమాకా
ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కింద మిల్లర్లకు సరఫరా చేస్తోంది. ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ప్రభుత్వానికి అప్పగించడం దానికి కమీషన్ రూపంలో ప్రభుత్వం చెల్లించడం జరిగే ప్రక్రియ. ఈ దందాలో మిల్లర్లకు డబుల్ ధమాకా. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని బయటకు విక్రయిస్తుండగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వానికే అప్పగిస్తోంది. అంటే ఇచ్చిన ధాన్యంతో లాభాలు గడిస్తుండగా కొనుగోలు చేసిన ధాన్యంతో లాభమే. దీంతో పలువురు మిల్లర్లు, మిల్లర్ల సంఘం నేతలు అనతికాలంలోనే రూ.50కోట్ల వరకు కూడగట్టినట్లు పక్కా సమాచారం.


