ఐఎస్‌వో పంచాయతీలు | - | Sakshi
Sakshi News home page

ఐఎస్‌వో పంచాయతీలు

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

నాణ్యమైన సేవలకు గుర్తింపు జిల్లాలో చామనపల్లి, వెలిచాల ఎంపిక ఆయా గ్రామాల్లో పర్యటించిన క్వాలిటీ ఆడిటర్‌ బృందం

కరీంనగర్‌రూరల్‌: కేరళ స్ఫూర్తితో తెలంగాణలోని గ్రామపంచాయతీలకు ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌( ఐఎస్‌వో) గుర్తింపు లభిస్తోంది. కేరళలో ప్రతీ గ్రామపంచాయతీకి ఐఎస్‌వో గుర్తింపు ఉండటంతో తెలంగాణలోని గ్రామపంచాయతీలు ఆ దిశగా ముందడుగు వేశాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఆదిలాబాద్‌ జిల్లాలోని ముఖరా(కే), పిప్రి, వాన్వాట్‌, మూత్నూర్‌, నార్నూర్‌ గ్రామపంచాయతీలకు ఐఎస్‌వో సర్టిఫికెట్లు దక్కించుకున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో ప్రజలకు అత్యుత్తమ ప్రమాణాలతో పారదర్శక సేవలు, జవాబుదారీతనంతో పాలన సాగిస్తున్న కరీంనగర్‌ మండలం చామనపల్లి, రామడుగు మండలం వెలిచాల గ్రామపంచాయతీలను గుర్తించారు. శుక్రవారం ఐఎస్‌వో క్వాలిటీ ఆడిటర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆలపాటి శివరామయ్య ఆద్వర్యంలో సభ్యులు చామనపల్లి, వెలిచాల గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, నర్సరీలు, క్రీడాప్రాంగణాలు, కంపోస్టు షెడ్లను పరిశీలించారు.

32 అంశాల ప్రాతిపదికన గుర్తింపు

ఐఎస్‌వో గుర్తింపు కోసం ఎంపిక చేసిన చామనపల్లి, వెలిచాల గ్రామపంచాయతీల్లో ఆడిటర్‌ శివరామ య్య బృందం సభ్యులు పర్యటించారు. నర్సరీ, కంపోస్టుషెడ్‌లను పరిశీలించి సర్పంచులు, కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఆయా గ్రామాల్లోని డ్రైనేజీ నిర్వహణ, తాగునీటి సరఫరా, పౌరసేవల అమలు, అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ, పీహెచ్‌సీలోని సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించడం, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, భూగర్భ జలాల సంరక్షణకు చేపట్టిన చర్యలు, ఘన వ్యర్ధాల నిర్వహణ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధికి అవసరమైన 32 అంశాల ఆధారంగా ఐఎస్‌వో సర్టిఫికెట్‌కు ఎంపిక చేస్తారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన సేవలను పరిగణనలోకి తీసుకుని గ్రామపంచాయతీలకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను వారంరోజుల్లో జారీ చేయనున్నట్లు ఐఎస్‌వో ఆడిటర్‌ శివరామయ్య తెలిపారు. రెండు గ్రామపంచాయతీలను స్ఫూర్తిగా తీసుకుని మిగితా గ్రామపంచాయతీల్లో నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు సేవలందించేందుకు సర్పంచులు, కార్యదర్శులు కృషి చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement