కరీంనగర్: నారీ శక్తి వందన్ అధినియం అద్భుత చట్టమని, దేశ చరిత్రలోనే మహిళలకు చారిత్రకంగా మిగిలిపోయే బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుతగలడం విచారకరమని, మహిళా లోకం ప్రతిపక్షాల కపట బుద్ధిని గమనించాలని బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు, సినీనటి కవిత అన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నారీ శక్తి వందన్ పాదయాత్రను గీతాభవన్ నుంచి కళాభారతి వరకు నిర్వహించారు. కళాభారతిలో మహిళల సమావేశం చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన సినీనటి కవిత మాట్లాడుతూ నారీ శక్తి వందన్‌తో చట్టసభల్లో మహిళలకు తగిన గుర్తింపు లభించకుండా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయన్నారు. ఆడబిడ్డలకు 33శాతం రిజర్వేషన్లు మోడీ ప్రభుత్వం ఇస్తున్న బహుమానాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేని స్థితికి తెచ్చాయన్నారు. బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్షాలకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలదేవి, మహిళా మోర్చా అధ్యక్షులు చొప్పరి జయశ్రీ, సాధినేని లావణ్య, గుగ్గిల మంజుల, గొట్టిముక్కల ఉమరాణి, పెద్దపల్లి శ్రీలేఖ, తాటిపర్తి ప్రభావతి, కొలిపాక రమ్యశ్రీ, వేముల కవిత, మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


