కరీంనగర్ అర్బన్: సమస్యల పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ లోకం గర్జించింది. కలెక్టరేట్ వేదికగా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్, మెడికల్ బిల్లులు, ఇన్సూరెన్స్ బిల్లులు, జీపీఎఫ్ వంటి రాజ్యాంగబద్ధ హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జూలై 1 2023నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాకపోవడం, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఓపీఎస్ పునరుద్ధరణ, హెల్త్ కార్డు అమలు, కాంట్రాక్ట్– ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి అంశాల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రం ఇచ్చారు. జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్, కటకం రమేశ్, పెండ్యాల కేశవరెడ్డి, పీఆర్టీయూ నాయకులు కరుణాకర్‌రెడ్డి, జేఏసీ నాయకులు తిరుపతిరావు, జావిద్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


