ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ పాఠశాల గదులను మూడేళ్ల క్రితం నిర్మించగా బిల్లులు ప్రభుత్వం చెల్లించడం లేదని గదులకు గురువారం తాళాలు వేయగా పోలీసులు పగులగొట్టారు. మళ్లీ రెండో రోజు శుక్రవారం సైతం తాళాలు వేయడంతో పోలీసులు చేరుకొని వల్లంపట్ల మాజీ సర్పంచ్ దంపతులను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3 తరగతి గదులను, హైస్కూల్‌లో డైనింగ్‌హాల్‌ను మూడేళ్ల క్రితం మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ నిర్మించారు. వీటికి బిల్లులు రూ.20లక్షల వరకు పెండింగ్ ఉన్నాయి. దీంతో మాజీ సర్పంచ్ గురువారం పాఠశాల గదులకు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. పాఠశాల హెచ్‌ఎం గురువారం ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం మాజీ సర్పంచ్ మళ్లీ పాఠశాల గదులకు తాళాలు వేసి బైటాయించగా ఇల్లంతకుంట ఎస్సై అశోక్ సిబ్బందితో వచ్చారు. మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ–వెంకట నరసింహారెడ్డిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ దంపతులను నోటీసులు అందజేసి సాయంత్రం విడుదల చేశారు.


