కరీంనగర్ అర్బన్: అభివృద్ధి ప్రణాళికలైనా.. వనరుల పంపిణీ అయినా.. ఉపాధి అవకాశాలైనా.. ప్రభుత్వ నిర్ణయాలకు ఆధారం జనగణనే. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలుకు ఇది ఎంతో ఉపయుక్తం. కేంద్రం దేశవ్యాప్తంగా సమగ్ర జనగణన చేపడుతుండగా డిజిటల్ పద్ధతిని అనుసరిస్తోంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు నమోదు చేసుకునే పద్ధతిలో కొన్ని మార్పులు చేసింది. స్మార్ట్‌ఫోన్‌తో పౌరులే ఆన్‌లైన్‌లో స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. సంబంధిత వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో ఈ నెల 26 నుంచి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
ఎక్కడి నుంచైనా.. కుటుంబంలో ఎవరైనా..
జిల్లాలో మే 11నుంచి జన గణన తొలి దశ ప్రారంభం కానుంది. హౌస్ లిస్టింగ్ పక్రియ జరగనుండగా జనగణనలో ఈసారి ప్రజలకు కూడ ఎన్యుమరేటర్లుగా బాధ్యతలు అప్పగించింది. వివరాలు చెప్పేందుకు ప్రజలు ఎవరికోసమో ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. సొంత ఊళ్లో లేకపోతే ఎక్కడి నుంచైనా వివరాలు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేదా సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. సంబంధిత పోర్టల్, మొబైల్‌లో నివాస గృహం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర సమాచారాన్ని స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఈ విధానంతో ఎన్యుమరేటర్ల కోసం వేచి చూడాల్సిన పని లేదు. దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఖర్చు ఆదా కానుండగా కుటుంబ సభ్యులందరూ అందుబాటులో లేకపోయినా పర్లేదు.
15 రోజులు అవకాశం
దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి మే10 వరకు వివరాల స్వీయ నమోదుకు ప్రత్యేక అవకాశమిచ్చారు. హౌస్ లిస్టింగ్‌కు ముందుగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంటుంది. మొత్తం 18 భారతీయ భాషల్లో వివరాలు నమోదు చేయవచ్చు. దీంతో ప్రతి వర్గానికి యాప్ అందుబాటులో ఉంటుంది.
ఎలా నమోదు చేయాలంటే
జనగణన వివరాలను http///se.census.gov.in వెబ్‌సైట్‌లో లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబరు, ఈ– మెయిల్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసిన వెంటనే ప్రశ్నావళి తెరుచుకుంటుంది. అందులో అవసరమైన వివరాలు నింపి సమర్పించాలి. తరువాత 11 అంకెల ప్రత్యేక ఐడీ వస్తుంది. ఇంటికొచ్చే ఎన్యుమరేటర్‌కు ఈ ఐడీని ఇవ్వాలి. వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశముంది.
జనగణన స్వీయ నమోదుకు అవకాశం
ఈనెల 26 నుంచి మే 10వ తేదీ వరకు అవకాశం


