సకాలంలో పూర్తికాని రైల్వేగేట్ల మరమ్మతులు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు 108, 104 వాహనాలకూ తప్పని సమస్యలు
ఓదెల: పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, రాఘవాపూర్, కన్నాల, రామగుండం లెవల్ క్రాసింగ్ గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గం లేక గ్రామస్తులు, ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. దాదాపు పదిరోజులుగా 104, 108 వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అత్యవసర వైద్యసేవల కోసం ఆస్పత్రులకు తరలించేవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. గేట్ల వద్ద స్లీపర్లు వేయడం, మరమ్మతులు చేయడంతో రాకపోకలను నిలిపివేయడం తప్పనిసరిగా మారింది.
అనుమతించని రైల్వేశాఖ
యంత్రాలు, కూలీలతో లెవల్ క్రాసింగ్ గేట్ల మరమ్మతులు చేపట్టిన రైల్వేశాఖ ఉన్నఽతాధికారులు.. రాకపోకలకు ఆయా ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడంలేదు. పనుల్లో జాప్యం కావడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు 15రోజులుగా బంద్ కావడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలు సైతం సుమారు 15 కి.మీ. వరకు దూరం తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తోంది. రద్దీ ఉండే లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని చాలాఏళ్లుగా విన్నవించుకుంటున్నా ఫలితం లేకుండాపోతోంది.


