ట్రాక్టర్‌ బోల్తాపడి యువ రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తాపడి యువ రైతు మృతి

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

చిగురుమామిడి: చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన కాటం కిషన్‌రెడ్డి(29) ట్రాక్టర్‌ బోల్తాపడి చనిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం. కిషన్‌రెడ్డి శుక్రవారం తన పొలాన్ని హార్వెస్టర్‌తో కోయించాడు. ధాన్యాన్ని మార్కెట్‌ స్థలానికి ఆరబోసేందుకు ట్రాక్టర్‌లో తీసుకొస్తున్నాడు. చెరువు కట్టపై వెళ్తుండగా చిన్న గుంతలో ట్రాక్టర్‌ బోల్తా పడటంతో కిషన్‌రెడ్డి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి కాటం లింగారెడ్డి ఫిర్యాదు మేరకు శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పృధ్వీధర్‌గౌడ్‌ తెలిపారు.

అప్పుల బాధతో వృద్ధుడి బలవన్మరణం

బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లికి చెందిన వృద్ధుడు వల్లంపట్ల ఎల్లయ్య(71) అప్పుల బాధతో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎన్‌.రమాకాంత్‌ తెలిపిన వివరాలు. ఎల్లయ్య కొత్తగా ఇంటిని నిర్మించుకోవడంతో అప్పులపాలయ్యాడు. ఈక్రమంలోనే అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం తెల్లవారుజామున తన కొత్త ఇంటి మెట్ల వద్ద లుంగీతో ఉరివేసుకున్నాడు. మృతుని కుమారుడు వల్లంపట్ల దుర్గయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య

తిమ్మాపూర్‌: భార్య చనిపోయిన బాధలో క్షోభపడుతూ భర్త ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మండలంలోని ఇందిరానగర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎలుక బాలయ్య(63) ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యాడు. కొన్ని నెలల క్రితం ఆయన భార్య భారతి రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోతున్నాడు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి పడుకుని, శుక్రవారం తెల్లవారి గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. స్థానికులు సాయంతో కిందకు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. తన తల్లి మరణించినప్పటి నుంచి ఆవేదనతో అనారోగ్యానికి గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బాలయ్య కొడుకు అరుణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అన్వర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement