వీర్నపల్లి(సిరిసిల్ల): ఆ నిరుపేద కుటుంబానికి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఉన్న ఊరిలో సొంత గూడు లేదు. సాగు చేసుకోవడానికి గుంట భూమి లేదు. రోజువారీ కూలి పనులకు వెళ్తేనే ఆ ఇల్లాలికి బుక్కెడు బువ్వ దొరుకుతుంది. అటువంటి నిరుపేద దళిత కుటుంబంలో క్యాన్సర్ మహమ్మారి తీవ్ర ఆందోళనను నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన గుంటుకు రాములు ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల రాములుకు కడుపునొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి క్యాన్సర్‌గా తేల్చారు. మెరుగైన చికిత్స అందిస్తేనే ప్రాణాలు నిలుస్తాయని డాక్టర్లు స్పష్టం చేశారు. అప్పటికే ఉన్నదంతా ఊడ్చి, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. కానీ, తదుపరి వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
పెద్ద మనసుతో ఆదుకోండి..
ఇంటి పెద్ద అనారోగ్యం బారిన పడటంతో రాములు భార్య స్వరూప కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఆ కుటుంబం ఆవేదన చెందుతోంది. దాతలు స్పందించి ఆదుకుంటే నాకు ఆయుష్షు పోసిన వారు అవుతారు అని రాములు కన్నీటి పర్యంతమయ్యాడు.
ఆదుకోవాలని నిరుపేద వేడుకోలు
కూలీపని చేస్తేనే పూట గడిచే పరిస్థితి
డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి


