అడిషనల్ డీజీపీ(సీఐడీ– ఏసీబీ) చారుసిన్హా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆదేశం కరీంనగర్ భరోసా కేంద్రం తనిఖీ
కరీంనగర్‌క్రైం: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సురక్షితమైన వాతావరణంలో చేయూతనందించి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ‘భరోసా’ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని అడిషనల్ డీజీపీ (సీఐడీ–ఏసీబీ) చారు సిన్హా పేర్కొన్నారు. గురువారం జిల్లాలో పర్యటించారు. కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి, సేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. బాధితులకు తక్షణ న్యాయసాయం, కౌన్సెలింగ్ అందించాలన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా పక్కాగా ఆధారాలు సేకరించాలన్నారు. కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్‌హాల్‌లో నిర్వహించిన అరైవ్– అలైవ్ కార్యక్రమంలో సీపీ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళనకరమన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అత్యంత కీలకమన్నారు. మద్యం సేవించి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దన్నారు. విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అడిషన ల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, వేణుగోపాల్, శ్రీనివాస్‌జి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


