కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని కలిసి విన్నవించారు. జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 563) విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోందని సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. పనుల్లో జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రహదారి పనుల్లో పురోగతి పెంచి, నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలను కలిపే ఈ కీలకమైన జాతీయ రహదారి పూర్తయితే కరీంనగర్, జగిత్యాల ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చినట్లు సత్యం తెలిపారు.
వేం నరేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు
రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్‌రెడ్డిని ఢిల్లీలో కలిసిన డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, హౌజ్‌ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తితో కలిసి నరేందర్ రెడ్డిని సన్మానించారు.


