సుల్తానాబాద్‌రూరల్: ఆమెను ప్రేమించాడు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, మరో యువతి మోజులోపడి భార్యను వేధించాడు.. మనస్తాపం చెందిన మండల ఆకాంక్ష(24) మంగళవా రం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై చంద్రకుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన ఆకాంక్షను సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మండల నాగరాజు మూడేళ్లక్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. నారాయణపూర్‌లోనే ఇద్దరూ నివాసం ఉంటున్నారు. నాగరాజు సుల్తానాబాద్‌లోని ఓ హోటల్‌లో టీ మాస్టర్ పనిచేస్తున్నాడు. మరోహోటలో పనిచేస్తున్న ఓ యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. తర చూ చాటింగ్ చేయడం, ఫోన్ లో మాట్లాడటం చేస్తున్నాడు. ఈవిషయం భార్య ఆకాంక్షకు ఆర్నెల్ల క్రితం తెలిసి భర్తను నిలదీసింది. అప్పటి నుంచి నాగరాజు భార్యను వేధిస్తున్నాడు. సుల్తానాపూర్‌లోని తన అత్తగాంటి వద్ద ఓ దైవ కార్యక్రమానికి నాగరాజు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. అక్కడ భార్యతో గొడవపెట్టుకొన్నాడు. భార్యను ద్విచక్ర వాహనంపై తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలోనే ‘నువ్వు చస్తే చావు’ అని బెదిరించాడు. ఇంటికి చేరుకున్నాక పనిపై భర్త బయటకు వెళ్లాడు. ఈక్రమంలోనే తీవ్రంగా మనస్తాపం చెందిన ఆకాంక్ష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
ఓ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు
మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు
ఇదేమిటని ప్రశ్నించిన భార్యను వేధించాడు
మనస్తాపం చెంది వివాహిత ఆత్మహత్య


