కరీంనగర్ కార్పొరేషన్: రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మేయర్ కొలగాని శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ఐదుశాతం రాయితీ స్కీం, పన్నుల వసూళ్లు, మ్యూటేషన్లు, రివిజన్ పిటిషన్లు, అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్లపై ఫిర్యాదులు, పరిష్కారం, డబుల్ ఇంటి నంబర్ల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. డబుల్ ఇంటి నంబర్ల సమస్యను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ టాక్స్ వస్తున్న అసెస్మెంట్లను తనిఖీ చేసి వాటి హెచ్చు తగ్గులు సరిచేయాలన్నారు. రెవెన్యూ అధికారుల తీరు సరిగా లేదని ప్రజల నుండి చాలా ఫిర్యాదులు వచ్చాయని, పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఐదు శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించి పన్ను వసూళ్లను పెంచాలని, పదిహేను రోజుల్లో లక్ష్యం చేరుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దీన్, వేణు మాధవ్ పాల్గొన్నారు.


