ఇందిరమ్మకు దళితబంధు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మకు దళితబంధు బ్రేక్‌

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

ఫోర్‌ వీలర్‌ ఉంటే ఇందిరమ్మ ఇల్లు రాదు

ప్రభుత్వ నిబంధనలతో ప్రజల్లో ఆందోళన

జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులకు మొండిచేయి

కరీంనగర్‌రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలోని నిబంధనలు నిరుపేదలకు శాపంగా మారాయి. స్వయం ఉపాధికోసం కొనుగోలు చేసిన కారు, జేసీబీ, ఫోర్‌ వీలర్లు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అడ్డంకిగా మారాయి. కుటుంబానికి కారు ఉందనే కారణంతో లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లను అధికారులు రద్దు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామని గృహనిర్మాణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు ఉన్నవారికి మంజూరైన ఇండ్లను హోల్డ్‌లో పెట్టినట్లు వివరించారు.

దళితబంధు లబ్ధిదారులకు ఇళ్లు లేవు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళితబంధు పథకం అమలు చేసింది. కరీంనగర్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా తాహెర్‌కొండాపూర్‌, నల్లగుంటపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. తాహెర్‌కొండాపూర్‌లో 29, నల్లగుంటపల్లిలో 37 యూనిట్లు మంజూరు చేసి, ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. లబ్ధిదారులు స్వయం ఉపాధి కోసం కార్లు, జేసీబీలు, ట్రాక్టర్లు తదితర వాహనాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొందరు లబ్ధిదారులు వాహనాలను విక్రయించగా, మరికొందరు వాటితో జీవనోపాధి పొందుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గతేడాది నుంచి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కోసం రెండు గ్రామాల్లోని దళితులు ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో విచారించిన అధికారులు కుటుంబాల పేరిట కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలుండటంతో మంజూరైన ఇళ్లను రద్దు చేశారు. దళితబంధు పథకంలో జీవనోపాధి కోసం వాహనాలు కొనుగోలు చేశామని, ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. శిఽథిలావస్థకు చేరి, కూలిపోయిన ఇండ్లల్లో నివాసముంటున్నామని, ప్రభుత్వం నిబంధనలను సడలించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని దళితబంధు లబ్ధిదారులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement