వేగం పెంచాలి
● ఆలస్యమవుతున్న అమృత్‌భారత్ పనులు
● పెద్దపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల్లో పెరగని వేగం
● ఇప్పుడిప్పుడే మొదలవుతున్న లిఫ్ట్, ఎస్కలేటర్ పనులు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్‌భారత్ పథకం అమలు చేస్తోంది. కానీ, పనుల్లో వేగం లేక ఆగుతూ.. సాగుతున్నాయి. పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించాలనుకునే వారికి కష్టాలు తప్పడం లేదు.
తాత్కాలిక షెడ్డులోనే టికెట్ కౌంటర్
తాత్కాలిక షెడ్డులో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. పనుల్లో వేగం పెంచాలని డీఆర్‌యూసీసీ సభ్యుడు ఎన్‌డీ తివారీ స్థానిక నాయకులతో కలిసి రైల్వేశాఖకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు పరిశీలించి వెళ్తున్నా వేగం పుంజుకోవడం లేదు. రైల్వేస్టేషన్ ముఖద్వారం నిర్మాణం పురోగతిలో ఉంది. లిఫ్ట్ పనులు ఇప్పుడే మొదలవుతున్నాయి. ఎస్కలేటర్ నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది.
పురోగతిలో భారీషెడ్డు
పెద్దపల్లి ప్రాంతంలోని గిడ్డంగుల్లో నిల్వకోసం, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బియ్యం, ఇతర సామగ్రి తరలించే సమయంలో ఎండ, వానలతో ఇబ్బంది లేకుండా భారీ షెడ్డు నిర్మాణం చేపట్టారు. దీనిపనులు పురోగతిలో ఉన్నాయి. భారీషెడ్ రైల్వేస్టేషన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
అనుకూలంగా పెద్దపల్లి
జిల్లా ప్రజానీకంతోపాటు పొరుగు జిల్లాలనుంచి బస్సు రూట్లలో వచ్చి రైళ్లలో ప్రయాణించే వారికి పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఎంతో అనువుగా ఉంది. రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే బస్‌స్టేషన్ ఉండడంతో ప్రయాణికులు రైలు ప్రయాణంవైపే మొగ్గు చూపుతున్నారు. పెద్దపల్లి–కరీంనగర్ మార్గం ద్వారా దూర, సుదూర ప్రాంతాలకు నడిచే రైళ్లకోసం బైపాస్ మార్గం అందుబాటులోకి రానుండడం, పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు అవసరమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించే అవకాశాలున్నాయి.
పెద్దపల్లి ప్రాంతంలో రైల్వే శాఖ చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పెద్దపల్లి–కూనారం రైలువంతెన పనులు ఏళ్లకేళ్లుగా సాగుతుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రయాణికులు, ప్రజల ఇబ్బందులను దూరం చేయాలి.
– నారాయణ్‌దాస్ తివారీ, డీఆర్‌యూసీసీ సభ్యుడు, పెద్దపల్లి


