నన్ను ఏకాకి చేశావా చెల్లె..
చందుర్తి(వేములవాడ): ‘ఇన్నాళ్లు మనకు ఎవరూ లేకున్నా.. ఒకరికొకరం తోడునీడగా ఉన్నాం.. కష్టసుఖాలను పంచుకున్నాం.. ఇప్పుడు నన్ను ఏకాకి చేసి వెళ్లిపోయావా చెల్లె.. నేను ఎవరి కోసం బతకాలె..’ అంటూ చెల్లె మృతదేహం వద్ద అక్క రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బండపల్లికి చెందిన తోకల బుచ్చవ్వ– మల్లయ్య దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం. పెద్ద కూతురు లచ్చవ్వ, రెండో కూతురు మల్లవ్వ(53)కు గతంలోనే పలువురితో పెళ్లి కాగా, విడాకులు తీసుకుని తల్లిగారింట్లో ఉంటుండగా, మరో ముగ్గురు వారివారి అత్తవారిళ్లలో ఉంటున్నారు. పెద్ద కూతురు, రెండో కూతురు కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేవారు. తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే మృతిచెందగా, లచ్చవ్వ, మల్లవ్వ ఒకరికొకరు తోడునీడగా జీవనం సాగిస్తున్నారు. వీరికి వారసులు లేరు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సోమవారం వరినాటు వేసి వచ్చిన మల్లవ్వ మంగళవారం వేకువజామున అస్వస్థతకు గురై అకస్మాత్తుగా మృతిచెందింది. చెల్లె మరణాన్ని తట్టుకోలేని అక్క గుండెలవిసేలా రోదించింది. అన్నీతానై కుటుంబాన్ని పోషించిన లచ్చవ్వ చివరకు చెల్లెకు తలకొరివి పెట్టేందుకు ఓ చేతిలో కుండ, మరో చేతిలో అగ్గి పట్టుకుని ముందు నడవడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు. బాధితులది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు విరాళాలు అందించారు. సర్పంచ్ కటకం మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ గడ్డం శ్రీనివాస్‌రెడ్డి పాడే మోసి ప్రగాడ సంతాపం తెలిపారు.
ఇన్నాళ్లు ఒకరికొకరు తోడునీడగా ఉన్న అక్కాచెల్లెలు
చెల్లె చితికి నిప్పు పెట్టిన అక్క
అంత్యక్రియలకు గ్రామస్తుల విరాళం
బండపల్లిలో విషాదం
నన్ను ఏకాకి చేశావా చెల్లె..


