అందుబాటులోనే పోలింగ్ కేంద్రాలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అందుబాటులో పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయి అన్నారు. పోలింగ్ బూత్‌ల ముసాయిదా జాబితాను ప్రకటించిన నేపథ్యంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటింగ్‌శాతం పెంచడమే లక్ష్యంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక కేంద్రంలో 800 ఓట్లకు మించి లేకుండా చర్యలు తీసుకొన్నామన్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై గురువారం సాయంత్రం 5గంటల లోగా నగరపాలకసంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగంలో అభ్యంతరాలు తెలియచేయాలన్నారు. అవసరమైతే సరిచేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీన డివిజన్ల పోలింగ్‌స్టేషన్‌ల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. కాగా ఓటర్లకు పోలింగ్ కేంద్రం సమీపంలో ఉండేలా, ఒకే ఇంటినెంబర్, కుటుంబ ఓట్లు ఒకే బూత్‌లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని పార్టీల ప్రతినిధులు కోరారు. వివిధ పార్టీల ప్రతినిధులు వైద్యుల అంజన్ కుమార్, నాంపల్లి శ్రీనివాస్, అబ్బాస్ సమి, అసీం, సత్తినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


