ఎనిమిది నెలలకే నూరేళ్లు
కోనరావుపేట(వేములవాడ): ఇద్దరు కూతుళ్ల తర్వాత కొడుకు పుట్టాడని ఎంతగానో సంతోషపడ్డారు. వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఎనిమిది నెలలకే మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు శోకసంధ్రంలో మునిగారు. రాజన్నసిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన జాగిరి అనిల్–సుస్మిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు శ్రీహర్షిక(6), ఆరాధ్య(4), కొడుకు వేదాంత్(8 నెలలు) ఉన్నారు. కొంతకాలంగా వేదాంత్ న్యూమోనియాతో బాధపడుతున్నాడు. సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారి వేదాంత్ మృతిచెందాడు.
మహిళకు తీవ్రగాయాలు
జమ్మికుంట: ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మహిళ తీవ్రగాయాలపాలైంది. స్థానికులు, బాధితురాలి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బండారి స్వరూప జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. తిరిగి వెళ్లేందుకు జమ్మికుంట బస్టాండులో బస్సు ఎక్కింది. ప్రమాదశాత్తు కాలుజారి కింద పడింది. తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయింపు
కొడిమ్యాల: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖంచాటేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన మండలంలోని నాచుపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ యువతి, ఓ యువకుడు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి పెళ్లి చేసుకుందామని నిలదీయడంతో ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో సదరు యువతి యువకుడి ఇంటిముందు బైఠాయించి న్యాయం చేయాలని వేడుకుంది.
వాహనం ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభం
ఇల్లంతకుంట: మండలకేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద ఆదివారం బ్లేడ్ బండి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగింది.సెస్ విద్యుత్ కాంట్రాక్టర్ వెంటనే స్పందించి సిబ్బందితో విరిగిన స్తంభం స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసిన విద్యుత్‌తీగలను సరిచేశారు. సెస్ ఏఈ నగేశ్‌కుమార్, లైన్‌మెన్ ఎల్లయ్య, హెల్పర్ తిరుపతి విరిగిన స్తంభాన్ని అక్కడ నుంచి తొలగించి విద్యుత్‌ను పునరుద్ధరించారు.
ఎనిమిది నెలలకే నూరేళ్లు
ఎనిమిది నెలలకే నూరేళ్లు


