
దోమలపై మీనాస్త్రం
గంబూిసియా చేపలతో దోమల వ్యాప్తికిచెక్●
● నీటి గుంతల్లో వేసేందుకు ప్రణాళిక ● లక్ష్మినగర్ చేపలు వదిలిన కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ● నగరం మొత్తం అమలుకు ఆదేశం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో దోమల వృద్ధికి చెక్ పెట్టేందుకు నగరపాలకసంస్థ చర్యలు చేపట్టింది. వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండడం, అందుకు దోమలే ప్రధాన కారణం అవుతుండడంతో నివారణ దిశగా ప్రణాళిక రూపొందించింది. నగరంలో ఖాళీ ప్రదేశాలు అధికం కావడం, వర్షపు నీళ్లు నిలుస్తుండడం తెలిసిందే. ఆ నీటి గుంతలు దోమల పుట్టుకకు కారణమవుతుండడంతో, దోమల పుట్టుకను హరించే గంబూసియా చేపలను వదిలే కార్యక్రమానికి బల్దియా శ్రీకారం చుట్టింది.
లార్వా తినే గంబూిసియా
దోమల వృద్ధిని అరికట్టడంలో గంబూసియా చేపలు అత్యంత కీలకం. సాధారణంగా వర్షాకాలంలో దోమలు వ్యాధుల విజృంభణకు కారణమవుతాయి. దోమల నివారణకు స్ప్రే, ఫాగింగ్, ఆయిల్‌బాల్స్ లాంటివి రసాయనాలతో కూడి ఉంటాయి. దోమల పుట్టుకనే లేకుండా చేసే ఈ గంబూసియా చేపలు ఎలాంటి హానికరం కావు. నీటి గంతల్లో దోమలు పెట్టిన గుడ్లు, లార్వా దశ దాటి దోమలుగా మారడానికి దాదాపు పదిహేను రోజులు పడుతుంది. ఆ గుంతల్లో గంబూిసియా చేపలు వదలడం వల్ల, ఆ చేపలు దోమల గుడ్లు, లార్వాను ఆహారంగా తీసుకొంటాయి. ఫలితంగా దోమల పుట్టుకే లేకుండా పోతుంది.
మత్స్యశాఖ నుంచి సేకరణ
నగరంలోని ఉజ్వల పార్క్ సమీపంలోని మత్స్యశాఖ చేపల పెంపక కేంద్రంలో ఈ గంబూసియా చేపలను పెంచుతున్నారు. ఒక్కో ప్యాకెట్‌లో 200 నుంచి 300 చేపపిల్లలు ఉంటాయి. ఇలా ప్యాకెట్‌లలో తీసుకువచ్చి, నీటి గుంతల్లో వదులుతుంటారు.
నీటి గుంతల గుర్తింపు
నగరపాలకసంస్థ పరిధిలో వర్షపు నీళ్లు నిలిచి, దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్న నీటిగుంతల గుర్తింపును పారిశుధ్య విభాగం చేపట్టింది. ఆయా డివిజన్లలో ఉన్న నీటి గుంతల వివరాలు సేకరించి ఇవ్వాలని సంబంధిత జవాన్లను అధికారులు ఆదేశించారు. నగరంలోని 66 డివిజన్లలో దాదాపు 250 నీటి గుంతల వరకు గుర్తించినట్లు సమాచారం. ఇలా గుర్తించిన నీటి గుంతల్లో దశలవారీగా అంటే వారం రోజుల్లోగా గంబూిసియా చేపలను వదిలేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
లక్ష్మినగర్ నుంచి శ్రీకారం
లక్ష్మినగర్ నుంచి గంబూిసియా చేపలను నీటి గుంతల్లో వదిలే కార్యక్రమానికి బల్దియా శ్రీకారం చుట్టింది. కాలనీలోని నీటి గుంతలో గంబూసియా చేపలను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులతో కలిసి వదిలారు. దోమలు వృద్ధిచెందే ప్రతి నీటి గుంతలో చేపలు వదిలి, దోమలను ఆదిలోనే అంతమొందించాలని నగరవాసులు కోరుతున్నారు.
వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి
నీటి గుంతల్లో గంబూసియా చేపలను వదిలే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తాం. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఎక్కడెక్కడ నీటి గుంతలున్నాయనేది గుర్తిస్తున్నాం. ఆ నీటి గుంతల్లో చేపలను వదలడం ద్వారా, దోమలు పుట్టకుండా చర్యలు చేపడుతాం.
– డాక్టర్ కట్ట సుమన్‌కుమార్,
మెడికల్ ఆఫీసర్, నగరపాలకసంస్థ

దోమలపై మీనాస్త్రం