
అంగన్‌వాడీలను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
తిమ్మాపూర్: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ కోసం అంగన్‌వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమికోన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. పోషణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం గుడ్లు పంపిణీ చేశారు. ప్రీస్కూల్ పిల్లలతో ముచ్చటించారు. సిలబస్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. ప్రతీ శుక్రవారం నిర్వహించే సమావేశాలకు మహిళలు హాజరై, అంగన్వాడీ సేవల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించి, వారి అభ్యసన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచీలు లేదా మ్యాట్‌లపై కూర్చోబెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల ప్రగతి నివేదికను తెలియజేయాలని ఆదేశించారు. బుధవారం బోధనను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, బాలల సంక్షేమ ప్రాజెక్టు అధికారి శ్రీమతి, ఎంఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.