
రోడ్డు మారలె.. ప్రమాదాలు ఆగలె
● అధ్వానంగా కరీంనగర్– కామారెడ్డి ప్రధాన రహదారి ● బోల్తా పడుతున్న వాహనాలు ● అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల పాట్లు
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్– కామారెడ్డి ప్రధాన రహదారి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. కొత్తపల్లి మండలం బావుపేట గ్రామం వద్ద ఏర్పడ్డ గుంతలతో రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రహదారిపై గుంతలను అంచనా వేయలేని డ్రైవర్లు ప్రమాదాలకు గురవుతున్నారు. రోజుకో వాహనం బోల్తా పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలన్న కనీస ఆలోచన లేకపోవడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనాలోచిత నిర్ణయం
కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ (బావుపేట) మీదుగా వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్‌కు రద్దీని దృష్టిలో పెట్టుకొని పద్మనగర్– ఒడ్యారం మధ్య 13.8 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి విస్తరణకు రూ.89 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. రహదారి వెళ్లే గ్రామాల్లో ఇరువైపుల నిర్మించే డ్రైనేజీల నీటి మళ్లింపుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో అధికారులు విఫలం కావడంతోనే బావుపేట వద్ద రోడ్డు సమస్య తీవ్రరూపం దాల్చింది. బావుపేట ఎన్‌టీఆర్‌కాలనీ మురికి నీరంతా ప్రధాన రహదారిపైకి రావడం, ఆ నీరు వెళ్లేందుకు దారి లేకపోవడంతో నెలల తరబడి నీరు రోడ్డుపైనే నిలిచి కుంటను తలపించడంతో, శిథిలావస్థకు చేరుకుంది. సమస్యను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం..‘సాక్షి’ కథనాలతో తాత్కాలికంగా నీటి మళ్లింపుకు చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలతో గుంతల్లో నీరు చేరడంతో వాహనాలు బోల్తా పడుతున్నాయి.
శాశ్వత పరిష్కారమెప్పుడు?
బావుపేటలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడన్న ప్రశ్న స్థానికులకు సందేహంగా మారింది. శిథిలావస్థకు చేరిన రహదారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పరిశీలించి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. రహదారిని పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి శాశ్వత పరిష్కారంగా రూ.90 లక్షలతో డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ఆ నిధుల మంజూరు ఎప్పుడూ..? తమ సమస్య పరిష్కారం ఎప్పుడని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
మరమ్మతు చేపట్టాలి
కరీంనగర్– కామారెడ్డి రహదారి బావుపేట వద్ద అధ్వానంగా తయారైంది. డ్రైనేజీ నీటి మళ్లింపులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఎన్‌టీఆర్ తమిళకాలనీ, ఖాజీపూర్ చౌరస్తాల్లో రహదారి శిథిలావస్థకు చేరింది. ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలి.
– సోమినేని తిరుపతి, ఖాజీపూర్

రోడ్డు మారలె.. ప్రమాదాలు ఆగలె

రోడ్డు మారలె.. ప్రమాదాలు ఆగలె