
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
కోరుట్ల: కోరుట్లలో కొంతకాలంగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న రుద్ర వేణుగోపాల్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సురేష్ బాబు కథనం ప్రకారం.. వేణుగోపాల్ పట్టణంలోని పోచమ్మవాడలో మంత్ర ఆన్‌లైన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రెండేళ్లుగా ఫొటోషాప్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మెమోలు తయారు చేస్తూ అవసరం ఉన్నవారికి విక్రయిస్తున్నాడు. పోలీసులకు సమాచారంతో అందడంతో ఎస్సై చిరంజీవి సిబ్బందితో కలిసి దాడి చేసి వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 106 నకిలీ ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, డెత్ సర్టిఫికెట్లు, కంప్యూటర్, కలర్ ప్రింటర్, పేపర్ కటింగ్, ల్యామినేషన్ మిషన్, మానిటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు శ్రీనివాస్, రాజు, అఫ్రోజ్, సాజిద్, వినోద్, సురేష్, కమలాకర్ పాల్గొన్నారు. వీరిని ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు.