
కరీంనగర్: తనను మంత్రి పదవి నుంచి విముక్తి కల్పించాలంటూ తాను అధిష్టానాన్ని కోరినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. అవన్నీ అవాస్తవమని బండి సంజయ్ ఖండించారు. మంత్రి పదవి తనకు వద్దని గానీ, కావాలని గానీ తాను అధిష్టానానికి చెప్పలేదన్నారు. ఈ మేరకు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ‘క్రమశిక్షణ గల బీజేపీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలాంటింది కాదు బీజేపీ. నాకు మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నేను నిర్వహిస్తా’ అని తెలిపారు.
రైతును రారాజున చేయడమే మోదీ లక్ష్యం..
చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానమంత్రి కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రై‘తును రారాజును చేయడమే మోదీ లక్ష్యం. 11 ఏళ్లలో రైతుల కోసం రూ. 71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మోదీది. రైతులు ఎరువుల కోసమే సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేశాం.
కనీస మద్దతు ధర అందించేందుకు 16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు చేసింది మోదీ సర్కారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల 69 వేల 561 కోట్లు జమ చేశాం. టెన్త్ బాగా చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు యత్నిస్తా ’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.