
చెట్టుకు ఢీకొట్టిన కారు
● అక్కడికక్కడే పీజీ మెడికో మృతి
● మృతుడు ఏపీకి చెందిన కడపవాసి
● మరో నలుగురు మెడికోలకు తీవ్ర గాయాలు
కరీంనగర్‌రూరల్: అతివేగం.. అజాగ్రత్త ఒకరి ప్రాణం తీసింది. నలుగురిని ఆస్పత్రి పాలు చేసింది. కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో ఒక మెడికో అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు మెడికోలు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాలలో ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఏటూరి రాహుల్ రామిరెడ్డి(20), గుంటూరులోని శ్యామలనగర్‌కు చెందిన మోపిదేవి జయంత్, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా చిందంటౌన్‌కు చెందిన కడియం వినయ్‌చౌదరి, హైదరాబాద్ ఎల్‌బీనగర్‌కు చెందిన ఎం.పృధ్వీరాజ్, సిద్దిపేటలోని మోయిన్‌పురకు చెందిన బి.పృధ్వీరాజ్‌లు ప్రతిమా మెడికల్ కాలేజీలో పీజీ ఆర్థో మొదటి సంవత్సరం చదువుతూ.. సమీపంలోని ఓ ప్రైవేట్‌హాస్టల్‌లో ఉంటున్నారు. సోమవారం సెలవురోజు కావడంతో ఎక్స్‌యూవీ700 (కేఏ36జెడ్3980) కారులో ఐదుగురు బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలోని స్నేహితులను కలిసి అర్ధరాత్రి 1.30గంటలకు చామనపల్లి మీదుగా ప్రతిమ కళాశాల వైపు బయల్దేరారు. కారు డ్రైవింగ్ చేస్తున్న జయంత్ జూబ్లీనగర్ శివారులోని మూలమలుపును గమనించకుండా వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి కారు బోల్తాపడింది. వెనుకసీట్లో కూర్చున్న రాహుల్ రామిరెడ్డి తలకు బండరాయి తగలడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగితా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం ఉదయం సీఐ నిరంజన్‌రెడ్డి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. రాహుల్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. జయంత్ అజాగ్రత్తగా కారు నడుపడంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి సోదరి సుష్మిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చెట్టుకు ఢీకొట్టిన కారు