
కళాశాల నుంచి పుస్తకాలు దొంగతనం
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి ఓ వ్యక్తి కొద్దిరోజులుగా విద్యార్థినుల పాఠ్యపుస్తకాలు దొంగిలిస్తున్నాడు. తరచూ ఇలాంటి ఘటన జరుగుతుండడంతో అనుమానం వచ్చిన అధ్యాపకులు కళాశాలలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ దొంగ వ్యవహారం బయటపడింది. శనివారం తరగతులు ముగిశాక విద్యార్థినులు పాఠ్యపుస్తకాలను కళాశాలలోనే ఉంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఆదివా రం, సోమవారం బోనాల పండుగ కావడంతో కళాశాలకు సెలవు. విద్యార్థినులు మంగళవారం కళాశాలకు వచ్చి చూసేసరికి తరగతి గదికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా పుస్తకాలు కనిపించలేదు. విషయాన్ని వారు అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కళాశాలలోని సీసీ కెమెరాలు పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి పాఠ్య పుస్తకాలు ఎత్తుకెళ్తున్నట్లు రికార్డయ్యింది. విద్యార్థినులు, అధ్యాపకులు కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీపుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. కళాశాలలో 700 మందిమి చదువుకుంటున్నామని, ప్రహరీ లేకపోవడంతోనే పాఠ్యపుస్తకాలు ఎత్తుకెళ్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు.
వరుసగా చోరీ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కిన దొంగ
పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అధ్యాపకుల ఫిర్యాదు