
నాలా.. ఎన్నాళ్లిలా!
కరీంనగర్ కార్పొరేషన్:
కరీంనగర్ స్మార్ట్‌సిటీ. రూ.వేల కోట్లతో అభివృద్ధి. ఆకర్షణీయమైన రహదారులు. అందమైన మీడియన్స్. ఫౌంటెన్లు పోసే కూడళ్లు. ఆకట్టుకునే విగ్రహాలు. ఇంతటి ఘనత సాధించిన స్మార్ట్‌సిటీ ఒక్కవానకే వణికిపోతుంది. గంటసేపు గట్టివాన పడితే చాలు వరదనీళ్లు రోడ్లపై పారుతున్నాయి. వీధులు కాలువలుగా మారుతున్నాయి. కూడళ్లు చెరువులవుతున్నాయి. ఇళ్ల వరద బురద ముంచెత్తుతోంది.
ఎవరికీ పట్టని డ్రైనేజీ వ్యవస్థ
● నగరంలో రహదారులు, వీధులు, కూడళ్లను అభివృద్ధి చేసిన పాలకులు డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టలేదు. శాసీ్త్రయంగా డ్రైనేజీలు నిర్మించిన దాఖలాలు ఏళ్లకాలంగా లేవు. దీంతో ఒక్కవానకే రోడ్లు, ఇళ్లు, వీధులు ముంపునకు గురవుతున్నాయి.
● నగరంలో ప్రధానంగా మూడు నాలాలు ఉన్నాయి. ఒకటి పోలీసు శిక్షణా కేంద్రం (పీటీసీ) నుంచి ప్రారంభమై, రాంనగర్, జ్యోతినగర్, ముకరంపుర, కలెక్టరేట్, అంబేడ్కర్ స్టేడియం, గణేశ్‌నగర్, లక్ష్మీనగర్ మీదుగా బైపాస్ దాటి ఎల్లమ్మ గుడి వద్ద మానేరువాగులో కలుస్తుంది.
● రెండోది కోర్టు ఎగువ ప్రాంతం నుంచి ప్రారంభమై ప్రశాంత్‌నగర్, సివిల్ హాస్పిటల్, శర్మనగర్, సాహెత్‌నగర్, సాయిబాబా గుడి, రైతుబజార్, బొమ్మవెంకన్న భవనం, గోపాల్ చెరువు మీదుగా వాగులో కలుస్తుంది.
● మూడోది రాంపూర్ ప్రాంతం నుంచి అలకాపురికాలనీ, డీమార్ట్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం నుంచి మానేరులో కలుస్తుంది. ఈ మూడు నాలాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీలు కలుస్తుంటాయి. నాలాల వైశాల్యం ఒక్కోచోట ఒక రకంగా ఉండడం, అక్కడక్కడా పైపులకే పరిమితం కావడం, డ్రైనేజీల లింక్‌లు సరిగా లేకపోవడంతో ఏటా వర్షాకాలం వరద రోడ్డెక్కుతోంది.
● పీటీసీ నుంచి వచ్చే నాలా 6 నుంచి 8ఫీట్ల వైశాల్యంతో ఉన్నప్పటికీ ముకరంపురకు వచ్చే సరికి కుచించుకుపోయింది. ఇక్కడ కేవలం 2 నుంచి 4 ఫీట్లు కూడా లేని పరిస్థితి. దీంతో ఎగువ ప్రాంతం నుంచి వేగంగా వచ్చే వరదకు నాలా సరిపోక, రోడ్లు, ఇళ్లల్లోకి చేరుతోంది.
● నాలాలకు కొనసాగింపుగా మెయిన్‌రోడ్లపై ఆర్‌అండ్‌బీ నిర్మించిన కల్వర్టులు సరిపడక సమస్య తీవ్రమవుతోంది. ముకరంపురలోని విమానం వీధి తరచూ మునగడానికి ఇదో కారణం. రాంనగర్ బస్‌స్టాప్ వద్ద కూడా డ్రైనేజీ వ్యవస్థను పద్ధతిగా కాకుండా, ఇష్టారీతిన డైవర్ట్ చేయడం వరద రోడ్డెక్కడానికి కారణమవతోంది.
● మంచిర్యాల చౌరస్తాలో నలువైపుల నుంచి వస్తున్న వరద నీటికి సరైన వ్యవస్థ లేకపోవడంతో కూడలి చెరువవుతోంది. ఎగువ భాగం నుంచి వచ్చే నాలా సివిల్ హాస్పిటల్ వద్దకు చేరే సరికి సామర్థ్యం సరిపోవడం లేదు. ప్రశాంత్‌నగర్ నుంచి వచ్చే డ్రైనేజీ పెట్రోల్‌బంక్ దాటగానే పైప్‌లైన్ కారణంగా సామర్థ్యం తగ్గి, వరద రోడ్డెక్కుతోంది.
● సవేరా హోటల్ వైపు నుంచి వచ్చి నాలాలో కలిసే డ్రైనేజీ సామర్థ్యం తక్కువగా ఉండడంతో, ఆ వరద కూడా రోడ్డుపైకి వస్తోంది. తూర్పు వైపు నుంచి వచ్చే వరదకు కూడా సామర్థ్యం సరిపోవడం లేదు. ఇలా నాలుగు వైపుల నుంచి వరద రోడ్డెక్కడంతో చౌరస్తా చెరువవుతోంది.
చెరువులు, కుంటల ఆక్రమణ
నగరంలోని చాలా చోట్ల చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో ఆ ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. ఆర్‌టీసీ వర్క్‌షాప్ సమీపంలోని కుంటను ఆక్రమించారు. దీంతో అక్కడ ప్రతి వర్షాకాలం వరద రోడ్డుపైకి వస్తోంది. గణేశ్‌నగర్, లక్ష్మినగర్, కిసాన్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఉండేవంటే కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. శర్మనగర్‌లో నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు వరదకు సమస్యగా మారాయి.
శాశ్వత పరిష్కారం ఏదీ..?
ప్రతి వర్షాకాలం నగరం ఎదుర్కొంటున్న సమస్య అయినా ముంపుపై శాశ్వత పరిష్కారం వైపు అధికారులు దృష్టి సారించడం లేదు. నిధుల సమస్య, ఇతరత్రా కార ణాలతో నగరం యూనిట్‌గా డ్రైనేజీల నిర్మాణం వైపు ఇప్పటివరకు అడుగు పడలేదు. వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగిన, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారు.
నగరంలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ
ఒక్క వానకే మునుగుతున్న కాలనీలు
శాశ్వత పరిష్కారం చూపని బల్దియా

నాలా.. ఎన్నాళ్లిలా!

నాలా.. ఎన్నాళ్లిలా!