
నిఘానేత్రం చూస్తోంది
● ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ● 20 రోజుల్లో 13,869 చలాన్లు.. రూ.1.13 కోట్ల జరిమానా
కరీంనగర్‌క్రైం: వాహనదారులు తస్మాత్ జాగ్రత్త.. నిఘా నేత్రం చూస్తోంది. గీత దాటితే క్లిక్ మనిపిస్తోంది. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా కమిషనరేట్ పోలీసులు కమాండ్ కంట్రోల్ ద్వారా గత నెల 27 నుంచి సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. 20రోజుల వ్యవధిలో 13,869 చలాన్లు వేసి, రూ.1.13కోట్ల జరిమానా విధించారు. అవగాహన కల్పించినా వాహనదారులు నిబంధనలు పాటించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అతివేగంగా వెళ్తున్నవారికి నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా జరిమానాలు విధిస్తున్నారు.
769 కెమెరాలతో నిఘా
నగరంలో గతంలో నిబంధనలు పాటించని వాహనదారులకు పోలీసులు కెమెరాలతో ఫొటోలు తీసి, స్టేషన్‌కు వచ్చి కంప్యూటర్, సెల్‌ఫోన్‌తో అప్‌లోడ్ చేసి జరిమానాలు విధించేవారు. గతనెల 27 నుంచి కరీంనగర్ కార్పొరేషన్‌లో ఏర్పా టు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. ఈ మేరకు నగరంలో 769 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. నిత్యం కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ జరిమానాలు విధిస్తున్నారు.
భారీగా జరిమానాలు
నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. జూన్ 27నుంచి జూలై 17తేదీ వరకు 13,869 కేసుల్లో రూ.1,13,43, 400 జరిమానాలు విధించారు. ట్రిపుల్ రైడింగ్ 8,808 కేసులు నమోదు కాగా.. రూ.1.05 కోట్లు జరిమానా విధించారు. సీట్‌బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్‌లో 3,437 మందికి రూ.3,43,700 జరిమానా విధించారు. 251మంది సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపగా.. రూ.2,51, 000 జరిమానాలు పంపించారు. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేసిన 418మందికి రూ.83,600 విలువైన చలాన్లు పంపించారు. తొలిరోజు హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపిన 955 మందికి రూ. రూ.95,500జరిమానాలు విధించారు. ప్రస్తుతానికి హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్‌పై జరిమానాలు విధించడం లేదని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు.