
ఓపీ ఫుల్.. మందులు నిల్
● ప్రభుత్వ యునాని వైద్యశాలలో మందులు కరువు ● మూడు నెలలుగా దీర్ఘకాలిక రోగులకు తిప్పలు ● స్పందించని ఆయుష్ విభాగం అధికారులు
కరీంనగర్‌టౌన్: ‘ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత లేదు. నిరుపేదలు ప్రైవేటుకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు. ప్రభుత్వాసుపత్రికి వస్తే వైద్యంతో పాటు మందులు ఉచితంగా పొందవచ్చు’ అని ప్రభుత్వం చెబుతోంది. కానీ జిల్లా యునాని ఆస్పత్రిలో మూడు నెలలుగా దీర్ఘకాలికవ్యాధులకు వాడే మందులే కరువయ్యాయి. యునాని ఆస్పత్రిని నగరంలోని రాంనగర్ నుంచి ప్రభుత్వ ప్రధానాసుపత్రికి మార్చారు. రోగు ల రద్దీ పెరిగినా.. సరిపడా మందులు దొరకడం లేదు. రోజుకు 100కు పైగా ఔట్ పేషెంట్లుగా వ స్తున్నారు. బీపీ, షుగర్ మందులు అందుబాటులో ఉండగా.. మూడు నెలలుగా మిగతా మందుల సరఫరా నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. 100మంది ఓపీలో సుమారు 40 నుంచి 50మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే వస్తుండగా.. వారికి మందులు అందడం లేదు.
యునాని వైపుమొగ్గు
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజలు యునాని వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. అల్లోపతితో నయంకాని రోగాలను సైతం యునాని నయం చేస్తుందనే నమ్మకం రోగుల్లో పెరుగుతోంది. కీళ్లు, మోకాళ్లు, నడుం నొప్పులు, ఆర్థరైటిస్, సైనసైటిస్, థైరాయిడ్ కిడ్నీలో రాళ్లు, ఆస్తమా, మలబద్ధకం, అర్షమొలలు, సోరియాసిస్, బొల్లి వంటి చర్మ వ్యాధులు తగ్గుతున్నాయని రోగులు చెబుతుండగా.. అవసరమైన మందులు లేకపోవడంతో ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నామని వాపోతున్నారు.