
గుండెపోటుతో హోంగార్డు మృతి
చిగురుమామిడి: చిగురుమామిడికి చెందిన కాశపాక సదానందం అనే హోంగార్డు గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం ఉదయం తన ఇంట్లో చాతినొప్పితో కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. గత నాలుగు నెలలుగా కరీంనగర్ హోంగార్డు ఆర్‌ఐ కార్యాలయంలో విధులు నిర్వహించేవాడని, దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితంలేకపోయిందని కుటుంబసభ్యులు వాపోయారు. సదానందంకు భార్య సంధ్యారాణి, కొడుకు విశాల్, కూతురు పూజ ఉన్నారు.
గురుకులం నుంచి విద్యార్థి పరార్
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నందిమేడారం బాలుర గురుకులం విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇమ్మిడి మెగా వర్షిత్ శనివారం వేకువజామున గేట్‌దూకి పరారయ్యాడు. వివరాలు.. ధర్మపురి మండల కేంద్రానికి చెందిన ఇమ్మిడి సత్తయ్య కుమారుడు మెగా వర్షిత్ ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో చేరాడు. ఇటీవల అతడికి జ్వరం రావడంతో తండ్రి ఇంటికి తీసుకవెళ్లి జ్వరం తగ్గాక మళ్లీ విద్యాలయానికి తీసుకవచ్చాడు.
శనివారం ఉదయం 4.30 గంటలకు విద్యార్థులందరినీ అసెంబ్లీ చేయించి హాజరుతీసుకుంటుండగా మెగావర్షిత్ గైర్హాజర్ అయినట్లు గుర్తించి ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కళాశాలలోని సీసీ కెమెరాల్లో పరిశీలించగా 4.23 గంటలకు విద్యార్థి కళాశాల గేట్ దూకి వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అతడి తండ్రికి సమాచారం అందించారు. ప్రిన్సిపాల్ విద్యాసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత విద్యార్థి కోసం వెతుకుతుండగా, నందిమేడారం పెట్రోల్ బంకు నుంచి పాతగూడూర్‌కు వెళ్లే రోడ్డు పక్కన మామిడితోటలో కనిపించాడు. కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత విద్యార్థిని తండ్రితో ఇంటికి పంపించారు.

గుండెపోటుతో హోంగార్డు మృతి