ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర శివారులోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం రాత్రి చిరుత సంచరించింది. గ్రామానికి చెందిన ఎదునూరి శ్రీనివాస్ పొలంలో చిరుత పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటువైపుగా రైతులు రాత్రిపూట వెళ్లవద్దని సెక్షన్ అధికారి సకారాం సూచించారు. మండలంలోని రాగట్లపల్లి, నారాయణపూర్, పదిర, హరిదాస్‌నగర్‌లలోనే వారం నుంచి చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు వెంటనే చిరుతను బంధించాలని రైతులు కోరుతున్నారు.
ముగ్గురు గల్ఫ్ ఏజెంట్లపై కేసు
వేములవాడరూరల్: యువకుడి మృతికి కారకులైన ముగ్గురు గల్ఫ్ ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ రూరల్ ఎస్సై అంజయ్య తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు. వేములవాడరూరల్ మండలం నూకలమర్రికి చెందిన ఓ యువకుడు ముగ్గురు ఏజెంట్ల ద్వారా సౌదీకి వెళ్లాడు. ఈ క్రమంలో సౌదీలో సరైన పని ఇవ్వకపోవడం, చిత్రహింసలకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. యువకుడి మృతికి కారకులైన వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన మేడుదుల రవి, వేములవాడఅర్బన్ మండలానికి చెందిన బొగ్గుల రాజేందర్, కామారెడ్డి జిల్లా డిచ్‌పల్లి మండలం ఇస్లాపూర్‌కు చెందిన షేక్ కుర్షీద్ అహ్మద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.