
బీజేపీలో క్రిప్టో మంటలు!
● రెండు వర్గాలుగా విడిపోయిన కేడర్ ● పోటీపోటీగా అంతర్గత సమావేశాలు ● కలకలం రేపుతున్న ‘క్రిప్టో’ వ్యవహారం
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
భారతీయ జనతాపార్టీలో లుకలుకలు బహిర్గతమవుతున్నాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ ర్గాలు జిల్లాలో రెండుగా విడిపోయి అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల క్రిప్టో కరెన్సీ వ్యవహరంలో పార్టీలో ముఖ్య నేత అండదండలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంతో రెండువర్గాలు కత్తులు దూసుకునే పరి స్థితి తలెత్తింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి.
వర్గపోరు.. రహస్య సమావేశాలు
హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వీడి మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన తర్వాత ఈటల రాజేందర్‌కు నియోజకవర్గ నాయకులతో కొంత గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కొత్త కేడర్‌ను కలుపుకొనిపోవడంలో విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ మండలంలోని ఓ రహస్య ప్రాంతంలో ఈటల (కొత్త) వర్గీయులు సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికపై చర్చించినట్లు తెలిసింది. కొత్త వర్గాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టింకోకపోవడమే కాక నియోజకవర్గ సమాచారం ఈటలవర్గానికి ఇవ్వకుండా, బండి వర్గానికి మాత్రమే చేరవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మండలాల బీజేపీ అధ్యక్షులుగా ఈటలవర్గం నాయకులకు నిర్ణయించిన తరువాత, వారిస్థానంలో బండి వర్గం నాయకులకు బాధ్యతలు అప్పగించారు.
‘స్థానికం’ కోసం తాడోపేడో
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొత్తవర్గానికి కాకుండా బండి సంజయ్ వర్గానికే టికెట్లు వస్తాయనే ప్రచారంతో బీజేపీలో గందరగోళం నెలకొంది. గత 25 ఏళ్ల నుంచి ఈటలతో వివిధ హోదాల్లో కలిసి పని చేసిన నాయకులకు ఎలాంటి గుర్తింపు లేదని, పాత బీజేపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాడో పేడో తేల్చుకోవడానికి ఈటలతో వచ్చే రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళి కపై చర్చించనున్నట్లు తెలిసింది. హుజూరాబాద్‌తో పాటు జమ్మికుంటలో మార్కెట్‌కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎర్రరాజు సురేందర్‌రాజు ఆధ్వర్యంలో శ్రీరామ్‌శ్యామ్, శ్రీనివాస్, ఇతర నాయకులు బుధవారం రహస్యంగా సమావేశం అయ్యారు. ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీ అయినప్పటి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల వర్గీయులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చర్చించారు. ఇటీవల జిల్లాలో కలకలం రేపుతున్న క్రిప్టో కరెన్సీ మోసాలపై దుమారం రేగుతోంది. గతంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ ఈ వ్యవహరంలో కీలక సూత్రధారిగా ఉండడం, మాజీ కార్పొరేటర్‌కు బీజేపీ ముఖ్యనేత అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండడంతో ఈ వ్యవహరం రచ్చరచ్చగా మారింది. బీజేపీ జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మొత్తం మీద ఇరువురు నేతల అనుచరుల మధ్య క్రిప్టో కరెన్సీ వ్యవహరం పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మంట పెట్టిన క్రిప్టో కరెన్సీ
కరీంనగర్‌లో వెలుగు చూసిన దాదాపు రూ.వంద కోట్ల క్రిప్టో కరెన్సీ కుంభ కోణం రెండువర్గాల మధ్య మంట పెట్టంది. కరీంనగర్‌కు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ సూత్రధారిగా భావిస్తున్న ఈ కుంభకోణంలో కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు రహస్యంగా విచారణ చేస్తున్నాయి. ఈ కుంభకోణంలో మాజీ కార్పొరేటర్‌కు బీజేపీ నాయకుడి అండదండలు ఉన్నాయన్న విషయం వెలుగు చూడడంతో బండి సంజయ్ వర్గం చెలరేగిపోతోంది. సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు ఎవరైనా సరే విచారణ జరిపి పోలీసులు చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ వర్గం మంగళవారం కరీంనగర్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది తెలిసిందే. ఈ ప్రెస్‌మీట్ అనంతరం ఈటల వర్గం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. మొత్తానికి క్రిప్టో కరెన్సీ వ్యవహారం జిల్లాలోని ఇద్దరు ముఖ్య నాయకుల అనుచరుల మధ్య పోటాపోటీ సమావేశాలకు కారణంగా నిలుస్తోంది.