
‘పరిషత్’కు పచ్చజెండా
● స్థానిక సంస్థల స్థానాలు ఖరారు ● మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు ● ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు ● ఆగస్టు చివరిలోగా పూర్తి చేసేలా చర్యలు
కరీంనగర్/కరీంనగర్ అర్బన్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామానికి తొలి అడుగు పడింది. స్థానిక సంస్థల స్థానాలను ఖరారు చేయగా జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. జిల్లాలో ఒక జెడ్పీ చైర్మన్‌తో పాటు కరీంనగర్ అర్బన్ మినహా 15 జెడ్పీటీసీ స్థానాలు, 15 ఎంపీపీ స్థానాలు, 170 ఎంపీటీసీ స్థానాలు ఉండనున్నాయి. సదరు స్థానాల్లో ఎన్నికలను నిర్వహించనుండగా జిల్లా ఎన్నికల విభాగం తదనుగుణ చర్యలు చేపడుతోంది. ఎన్నికల విభాగం ఎన్నికల సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేయగా మరోసారి పునఃసమీక్షించనున్నారు.
ఏడాదిగా ప్రత్యేక పాలన
2024 జూన్‌లో పాలక వర్గాల కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే మండల, జిల్లా పరిషత్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలయ్యాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చింది. ఆగస్టు చివరిలోగా మండల, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఓటర్ల తుది జాబితాను రూపకల్పన చేసేందుకు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 318 గ్రామపంచాయతీలు, 2,962వార్డులు, 170 ఎంపీటీసీ స్థానాలు, 15 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 2,962 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు.
రిజర్వేషన్లపై రానున్న స్పష్టత
బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరికొద్ది రోజుల్లో రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక ఎన్నికల్లో వరుసగా పదేళ్ల పాటు ఒకే రిజర్వేషన్ అమలులో ఉండేలా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం చట్టంలో సవరణలో తీసుకువచ్చేందుకు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను గవర్నర్ విడుదల చేసిన వెంటనే పరిషత్‌తో పాటు సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్‌లను ఖరారు చేయనున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా యూనిట్‌గా, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు రిజర్వేషన్లు ఏ విధంగా వస్తాయోనన్న సందిగ్ధతతో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో ఖరారు చేయనుండడంతో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సిద్ధంగా ఉంచారు. రిటర్నింగ్ ఆఫీసర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే మొదటి విడత ఎన్నికల శిక్షణను పూర్తి చేశారు. ఎన్నికల కోసం ఇతర సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని సమీకరించి వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి పరిషత్ ఎన్నికలు పూర్తి చేసి తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.