
అన్ని పాఠశాలల్లో ‘బుధవారం’ బోధన
● చల్లూరు జెడ్పీహెచ్‌ఎస్ ఆదర్శనీయం ● కలెక్టర్ పమేలా సత్పతి
వీణవంక/జమ్మికుంట: విభిన్న రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న చల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదర్శనీయమని, ఆంగ్లంలో పట్టు సాధించేందుకు ఇక్కడ ప్రారంభించిన ఇంగ్లిష్ క్లబ్‌ను జిల్లావ్యాప్తంగా అమలు చేస్తామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. వీణవంక మండలం చల్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘బుధవారం బోధన’ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పెయింటింగ్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ‘బుధవారం బోధన’ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దేందుకు చల్లూరు పాఠశాల ఉపాధ్యాయ బృందం తీసుకున్న చర్యలను అభినందించారు. ఇక్కడి విద్యార్థి ప్రపంచ వేదిక టెడ్‌హెడ్ కార్యక్రమానికి ఎంపికవడంపై అభినందించారు. జిల్లావ్యాప్తంగా ఇంగ్లిష్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎంఈవో శోభారాణి, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో శ్రీధర్ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, హెచ్‌ఎం సంపత్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం చల్లూరులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. లబ్ధిదారు ఐలవేణి స్వరూప కుటుంబసభ్యులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు.
ప్రసవాల సంఖ్య పెంచాలి
జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పత్తి సూచించారు. జమ్మికుంటలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వైద్యాధికారులతో సమీక్షించారు. అయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. గర్భిణులకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని తెలిపారు. ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎంహెచ్‌వో వెంకటరమణ, సూపరింటెండెంట్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.