
రోడ్లపై చెత్త కనిపిస్తే చర్యలు తప్పవు
● నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రోడ్లపై ఎక్కడ చెత్త కనిపించినా సంబంధిత శానిటరీ జవాన్లు, ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తప్పవని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. బుధవారం కళాభారతిలో పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో నమస్తే డే వేడుకలు జరిగాయి. స్వచ్చ్ ఆటో, ట్రాక్టర్ కార్మికులకు, డ్రైన్ క్లీనర్లకు ఆఫ్రాన్స్, గంబూట్స్, గ్లౌజ్, హెల్మెట్లు, మాస్కులతో కూడిన రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవ్యాప్తంగా రోడ్లు పరిసర ప్రాంతాల్లో చెత్త కనపడకుండా శుభ్రం చేయాలన్నారు. విధుల్లో జవాన్లు, ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛ ఆటో ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. జంక్షన్లలో ఫ్లెక్సీలు ఉంటే పారిశుధ్య కార్మికులు కూడా తొలగించొచ్చని సూచించారు. ఇంటినెంబర్ ప్రకారం ఇచ్చిన పెండింగ్ ట్రేడ్ లైసెన్స్‌ను త్వరగా పూర్తి చేయాలని, 9వేల ట్రేడ్ లైసెన్స్‌ల లక్ష్యాన్ని చేరాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించాలన్నారు. కార్మికులు తమకు ఇచ్చిన ఆఫ్రాన్లు, బూట్లు, గ్లౌజ్‌లు, మాస్కులు ధరించి పనిచేయాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, వెటర్నరీ అధికారి దుర్గా ప్రసాద్‌రెడ్డి, పర్యావరణ ఇంజినీర్లు స్వామి, రమేశ్ పాల్గొన్నారు.
బయో మైనింగ్ వేగవంతం చేయాలి
నగరంలోని డంప్‌యార్డ్‌లో బయోమైనింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులు, ఏజెన్సీని ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో ఇంజినీరింగ్ అధికారులు, బయోమైనింగ్ ఏజెన్సీ కాంట్రాక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. డంపింగ్‌యార్డ్‌లో చెత్తను బయోమైనింగ్ పనిలో వేగం పెంచాలన్నారు. కొత్తగా బయోమైనింగ్ కోసం వచ్చిన నిధులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను చేపట్టాలన్నారు.