
జర మమ్మల్ని పట్టించుకోండి
● కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆవేదన
కరీంనగర్: ‘పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పడు పార్టీ కోసం కష్టపడ్డాం..కేసుల పాలయ్యాం..దాడులకు గురయ్యాం. అన్నింటిని ఎదుర్కొని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేశాం. అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా.. మమ్ముల్ని పట్టించుకునే వారే లేరు’ అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశానికి ఉమ్మడి జిల్లా టీపీసీసీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. అధికారంలోకి వచ్చిన సంబురమే కానీ.. కార్యకర్తలకు ఒరిగిందేమీ లేదని.. ‘పార్టీ పదవులు ఇవ్వరు. నామినేటెడ్ పదవులు పంచరు. తమ బాధలను ఎవరికి చేప్పుఉకోవాలి’ అని వాపోయారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ అసలైన కార్యకర్తలను విస్మరించడం తగదన్నారు. ఇలా అయితే పార్టీ ఎలా బతుకుతుందని ప్రశ్నించారు.