అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సిరిసిల్లక్రైం: సిరిసిల్లలోని అంబికానగర్‌కు చెందిన నెల్లుట్ల అంజయ్య (65) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యుల్లోని కొందరితో కలిసి మద్యం సేవించిన అంజయ్య ఉదయానికల్లా ఇంటి ఎదుట విగత జీవి గా పడి ఉన్నాడు. అంజయ్య కూరగాయల మార్కెట్లో అల్లంవెల్లుల్లి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి రెండో వివాహం కాగా ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గరెపల్లిలో మహిళ..
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గర్రెపల్లి గ్రామ సమీపంలోని పశువుల సంత రేకులషెడ్డులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పత్రి కళావతి(50) శనివారం అనుమా నాస్పదస్థితిలో మృతి చెందింది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. తంగళ్లపల్లికి చెందిన నర్సయ్య – కళావతి భార్యాభర్తలు. ఈనెల 27న సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చేరుకున్నారు. భిక్షాటన చేశాక పశువుల సంతలోని రేకులషెడ్డు తలదాచుకుంటున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ మద్యం తాగి పడుకున్నారు. శనివారం ఉదయం భర్త లేచి చూడగా.. ఎంతకీ నిద్రలేవలేదు. దీంతో ఆమె మృతి చెందిందని భా వించి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మృతదేహంపై గాయాలు కనిపించాయి. అయితే, ఐదు రోజుల క్రితం ద్విచక్రవాహనం పైనుంచి ఇద్దరూ పడిపోగా.. ఇద్దరికీ గాయాలయ్యాయని నర్సయ్య తెలిపాడు. మృతురాలి చిన్నకూతురు కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గుండెపోటుతో ఉపాధి కూలీ...
కోరుట్ల రూరల్: మండలంలోని నాగులపేట గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి కుంట లక్ష్మీనర్సు (55)గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మీనర్సు ఎప్పటిలాగే కూలికి వెళ్లింది. తోటికూలీలతో కలిసి కాలువ పూడికతీత పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. అక్కడే కుప్పకూలింది. కూలీలు 108లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్మీనర్సు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మీనర్సుకు కుమారుడు, కూతురు ఉన్నారు.


