మహిళా సంఘాల పనితీరు మెరుగుపడాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఉన్న సమైక్యసంఘాల పనితీరు మరింత మెరుగుపడాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. గురువారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో మెప్మా విభాగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. సమైక్య సంఘాల వివరాలు, వాటి పనితీరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, సీ్త్రనిధి రుణా లు, బ్యాంక్ ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలపై చర్చించారు. రిజిష్టర్లు, రికార్డులను తనిఖీ చేసి పలు సంఘాల అవకతవకలపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని సమైక్యసంఘాల కార్యకలాపాలు పెరగాలన్నారు. సీవోలు, టీఎంసీ సమైక్య వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సంఘాల్లో ఆర్‌పీలు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా సీవోలు సమాచారం అందించి, వారిని సంఘాల నుంచి తొలగించాలన్నారు. పేద, మధ్య తరగతికి చెందిన మహిళలే ఎక్కువగా సమైక్య సంఘాల్లో సభ్యులుగా ఉంటారని, వారికి ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించాలన్నారు. సంఘాల ఆర్థిక లావాదేవీలపై జాగ్రత్తలు పాటించాలన్నారు. సీ్త్రనిధి రుణాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా టీఎంసీ, సీఓలు చర్యలు తీసుకోవాలన్నా రు. అనంతరం నగరపాలకసంస్థ ఆవరణలో మహిళా క్యాంటీన్‌కు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో మెప్మా ఇన్‌చార్జీ పీడీ, డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, టీఎంసీ అనిత, సీవోలు పాల్గొన్నారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్‌టౌన్: ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసి గిరిజన మహిళపై అత్యాచారయత్నం, దాడి ఘటనను ఖండిస్తూ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణచౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందని, అత్యాచారానికి గురైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని లేకుంటే ఆ బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేశ శిల్ప, జిల్లా ప్రధాన కార్యదర్శులు బైరి చంద్రకళ, ఎడ్ల ప్రేమలత, లావణ్యరెడ్డి, తేజ, అశ్విని, కన్నాంబ, మాజీ జెడ్పీటీసీ అన్నపూర్ణ పాల్గొన్నారు.
ఉచిత విద్యుత్ జీవో జారీపై ఎస్టీయూ హర్షం
కరీంనగర్: ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లుగా గురువారం రవీంద్ర భారతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అమలు చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ నిబద్ధతను రుజువు చేస్తూ జీవో విడుదల చేయడంపై ఎస్టీయూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పీఆర్ శ్రీనివాస్, కట్టా రవీంద్రచారి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలో సర్వీస్ పర్సన్ల నియామకానికి సంబంధించి నిధులు విడుదల చేయాలని, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్కూల్ గ్రాంట్లు సత్వరం విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: కరీంనగర్‌లో చేపట్టిన విద్యుత్ మరమ్మతు పనులతో పాటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ సాయికృష్ణ ఫీడర్ పరిధిలోని భగత్‌నగర్, ముకరంపుర, తెలంగాణచౌక్ నుంచి మున్సిపల్ ఆఫీసు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, కలెక్టరేట్ కాంప్లెక్స్ ముందు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.సుధీర్ కుమార్ పేర్కొన్నారు.
మహిళా సంఘాల పనితీరు మెరుగుపడాలి


