నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్‌పేటలో ఆదివారం సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు వాజీద్, బావ్‌సింగ్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పకూడదని సూచించారు. ఫోన్లలో వచ్చే గుర్తుతెలియని లింకులను ఓపెన్ చేయొద్దని అన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లాలో పేకాట స్థావరాలపై నిఘా పెట్టిన పోలీసులు శని, ఆదివారాల్లో దాడులు నిర్వహించి 18 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ రాజేశ్‌చంద్ర ఆదివారం వివరాలను వెల్లడించారు. దోమకొండ గ్రామ శివారులో, నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లిలో పేకాట ఆడుతున్న నలుగురిని, జుక్కల్ మండలం పెద్దగుళ్ల గ్రామంలో ఏడుగురిని, ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌లో గేమింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని పట్టుకున్నారు. మొత్తం నాలుగు ఘటనల్లో కలిపి రూ.18,690 నగదు, 13 సెల్‌ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, ఆయా ఠాణాల్లో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఎల్లారెడ్డి: కుటుంబ కలహాలతో ఒకరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి మండలం పోసానిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాధపల్లి వినోద్(32)కు భార్యతో ఇంట్లో గొడవ జరిగింది. అనంతరం క్షణికావేశంలో ఇంట్లోని గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


