కొనుగోలు కొర్రీ.. రైతు వర్రీ | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కొర్రీ.. రైతు వర్రీ

Nov 30 2026 12:46 AM | Updated on Nov 30 2026 12:46 AM

కొనుగోలు కొర్రీ.. రైతు వర్రీ ఎవరూ కొంటలేరు ధర తగ్గించిన వ్యాపారులు

● ప్రభుత్వ సెంటర్లలో నిబంధనలు

● ధర తగ్గించేసి దగా చేసిన వ్యాపారులు

● లబోదిబోమంటున్న రైతులు

‘వానలు వడక, కరెంటు సక్కగ రాక, పంటను కాపాడుకునేతందుకు ఎన్నో కష్టాలు పడ్డం. ఆఖరుకు పంట చేతికొచ్చినంక అమ్ముకుందమంటే కేంద్రంల ఎవరూ పట్టించుకోరు. సావుకార్లు మంచి ధర అనంగనే ముందుగళ్ల కోసిన వాళ్లంతా అమ్ముకున్నరు. ఇప్పుడు అందరూ ఒక్కటై ధర తగ్గించిండ్రు. అటు సర్కారు కొనదు. ఇటు వ్యాపారులు ధర తగ్గించిండ్రు. మా ఎగుసం అంతా ఎండుగుల్ల గలిసినట్టయ్యింది’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, రైతులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌’. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 3,19,361 ఎకరాల్లో వరి పంట సాగైంది. నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది వానాకాలంలో 4.57 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురవడంతో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. దీనికి తోడు పంటకు సరిగా నీరందక దెబ్బతిని దిగుబడి తగ్గింది. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 418 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు కేవలం 50 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. 10,202 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

కేటాయింపులు ఆలస్యం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నా, ఎక్కడా సరైన ఏర్పాట్లు చేయలేదు. గతంలో రైస్‌మిల్లులకు నేరుగా కేటాయించేవారు. ప్రభుత్వం విధానం మార్చి కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేస్తోంది. అక్కడి నుంచి మిల్లులకు కేటాయిస్తుంది. అయితే మిల్లర్లకు ధాన్యం కేటాయింపు విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించడంతో ఆలస్యమైంది. నిన్న మొన్న మిల్లుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపినప్పటికీ వడ్లను జాలి పట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో రైతులు వెనకడుగు వేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో పెద్దగా పొల్లు రాదని తెలిసి కూడా జాలి పట్టాలన్న నిబంధన పెడుతున్నారని, అదే ప్రయివేటులో వ్యాపారులు ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేశారని రైతుల పేర్కొంటున్నారు. ప్రభుత్వం పెడుతున్న నిబంధనలు ఇబ్బందికరంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ముందుగల్ల పంట వచ్చినోళ్లు మంచి ధరకు ప్రయివేటుల అమ్ముకున్నరు. మాపొలం కోసే సరికి ధర తగ్గిపోయింది. సర్కారు కేంద్రంల కూడా ఇంకా కొంటలేరు. ధర తగ్గినా వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది.

– శ్రీనివాస్‌, రైతు, టీకారాంతండా, పెద్దకొడప్‌గల్‌

మొదట్లో వరి కోసింది కోసినట్టే మంచి ధరతో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేశారు. బాన్సువాడ, బీర్కూర్‌ ప్రాంతంలో మొదటి పంట చేతికి రాగానే క్వింటాలుకు రూ.3,200 నుంచి రూ.3,600 వరకు ధర పలికింది. ఆ తర్వాత ధర తగ్గుతూ వచ్చింది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్‌, పిట్లం, గాంధారి, లింగంపేట, తాడ్వాయి, రాజంపేట, భిక్కనూరు, సదాశివనరగ్‌, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపే ట, కామారెడ్డి తదితర మండలాల్లో పంట కొంత ఆలస్యంగా చేతికి రాగా, వ్యాపారులు ధర తగ్గించేశారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.2,600 నుంచి రూ.2,800 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులు బాగోలేక వ్యాపారులు ధర ఎంత తగ్గించినా రైతులు ధాన్యం అమ్ముకునే దుస్థితి దాపురించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement