రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్ బ్రిడ్జీపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తూరు జనార్దన్(60) అనే వ్యక్తి మృతి చెందాడు. మామిడిపల్లి యోగేశ్వర కాలనీకి చెందిన జనార్దన్ తన ద్విచక్ర వాహనంపై పట్టణానికి వెళ్తుండగా ఆటో ట్రాలీ ఢీకొట్టింది. దీంతో వాహనం పై నుంచి కిందపడిన జనార్దన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపే జనార్దన్ మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
● పోచారం యువకుడు మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం శాలీపేట్ గేట్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగిరె డ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందగా మరో యువకునికి తీవ్రగాయాలయ్యాయి. పోచారం గ్రామానికి చెందిన కలాలి సాయిచరణ్ గౌడ్(26) పని నిమిత్తం మెదక్ వెళ్లి అదే గ్రామానికి చెందిన ఆటోలో గురువారం రాత్రి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆటో శాలీపేట్ గేట్ సమీపంలోని మూలమలుపు వద్దకు చేరుకోగానే అదే సమయంలో ఎల్లారెడ్డి వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సాయిచరణ్‌గౌడ్‌తోపాటు అదే గ్రామానికి చెందిన బేస్త సాయికుమార్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇరువురిని చికిత్స నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. సాయిచరణ్ గౌడ్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి కలాలి శ్రీనివాస్‌గౌడ్ హవేలీ ఘనపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


