వాతావరణం అనుకూలిస్తేనే..
నాగిరెడ్డిపేట: వానాకాలం సీజన్ ప్రారంభమై మూడు వారాలు గడిచినా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు. చాలా మండలాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో బుధవారంనాటికి సాధారణ వర్షపాతం 104.6 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా.. 75.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యింది. భిక్కనూరు, కామారెడ్డి రూరల్ మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం రికార్డయ్యింది. జుక్కల్, బిచ్కుంద, బీర్కూర్, నస్రుల్లాబాద్, సదాశివనగర్, కామారెడ్డి అర్బన్, దోమకొండ, పాల్వంచ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయింది.
నిజాంసాగర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, మహ్మద్‌నగర్ మండలాల్లో తీవ్ర లోటు ఉంది. మద్నూర్, పెద్దకొడప్‌గల్, బాన్సువాడ, పిట్లం, గాంధారి, తాడ్వాయి, రాజంపేట, మాచారెడ్డి, బీబీపేట, డోంగ్లీ మండలాల్లో లోటు వర్షపాత పరిస్థితులున్నాయి.
కొనసాగుతున్న ఎండల తీవ్రత
జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. సగటు ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీల మధ్యలో రికార్డవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత మద్నూర్ మండలం సమూర్‌లో 37.7 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.
ముందుకు సాగని పనులు..
జిల్లాలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో చురుకుగా మారకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడక్కడ నమోదైన స్వల్ప వర్షపాతం వల్ల పొలాల్లో తేమ పెద్దగా పెరగలేదు. రైతులు నారుమడులు పోసుకున్నా.. నాట్లకు సమాయత్తం కాలేకపోతున్నారు. పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, కంది తదితర పంటల సాగు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.
ప్రస్తుతం నెలకొన్న వర్షభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను సాగు చే యడం మేలు. వరికి బదులు గా కంది, పెసర, మినుములు వంటివి సాగు చేయాలి. వాతావరణం అనుకూలిస్తేనే విత్తనాలు నాటాలి.
– రేవంత్ నాథన్, శాస్త్రవేత్త, తెలంగాణ
రైతువిజ్ఞాన కేంద్రం, మాల్తుమ్మెద
భారీ వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ముందస్తుగా విత్తనాలు వేస్తే మొలక శాతం తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విత్తిన పంటలకు అవసరమైన తేమను కాపాడేందుకు పొలాల్లో తేలికపాటి దుక్కి పనులు చేపట్టాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంట రకాలను ఎంపిక చేసుకోవాలని, పశువులకు తగినంత తాగునీరు, పచ్చిమేత అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
జోరందుకోని పంటల సాగు
అత్యధిక మండలాల్లో
లోటు వర్షపాతం నమోదు
ఐదు మండలాల్లో తీవ్ర లోటు..
ఆరుతడి పంటలు వేయాలంటున్న
వ్యవసాయ శాస్త్రవేత్తలు


