మాచారెడ్డి: లచ్చాపేటలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ పాఠశాల బస్సును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన టీచర్లు ఉన్నారన్నారు. అన్ని సౌకర్యాలున్న సర్కారు బడిలోనే తమ పిల్లలను చేర్పిస్తామన్నారు. గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావడానికి వీలు లేదని పేర్కొన్నారు. గ్రామానికి వచ్చిన బస్సులను అడ్డుకుని వెనక్కి పంపించారు.
నిజాంసాగర్: సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పేర్కొన్నారు. బుధవారం మల్లూర్‌లో ఇందిరమ్మ లబ్ధిదారు గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుడిసెలు, రేకుల షెడ్లలో ఉంటున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి, నాయకులు అంజయ్య, శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో వెంకట్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. మండలంలోని పలు ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఎల్లంపేటలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారికి సూచించారు.


