తాడ్వాయిలో తీవ్ర ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

తాడ్వాయిలో తీవ్ర ఉద్రిక్తత

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

యూరియా యాప్‌ ఎత్తేయాలంటూ

ఆందోళనకు బీఆర్‌ఎస్‌ పిలుపు

ధర్నాను అడ్డుకున్న పోలీసులు

ఎక్కడికక్కడ నేతల అరెస్ట్‌

తాడ్వాయి: యూరియా యాప్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు మండలకేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ఎల్లారెడ్డి–కామారెడ్డి రోడ్డుపై పెద్దసంఖ్యలో బలగాలను మొహరించారు. ప్రతివాహనాన్ని క్షుణంగా తనిఖీ చేస్తూ పంపించారు. ముందస్తుగానే ముఖ్య నేతలను అరెస్ట్‌ చేశారు. ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిలో ఉన్న కృష్ణాజీవాడి, దేవాయిపల్లి, తాడ్వాయి, ఎర్రాపహాడ్‌లతో పాటు రోడ్డుకిరువైపులా ఉన్న దేమికలాన్‌, చందాపూర్‌, చిట్యాల, సంగోజీవాడి, సంతాయిపేట్‌, ఎండ్రియాల్‌, నందివాడ గ్రామాలలోనూ పోలీసులు పహారా కాశారు. అరెస్ట్‌ చేసినవారిని దోమకొండ, గాంధారి, కామారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్‌, సదాశివనగర్‌, నాగిరెడ్డిపేట్‌ పోలీసు స్టేషన్‌లకు తరలించారు.

ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే..

పోలీసులు ధర్నాను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు సురేందర్‌ను అరెస్టు చేశారు. తాడ్వాయి సింగిల్‌ విండో చైర్మన్‌ కపిల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముదాం నర్సింలు పెట్రోల్‌ డబ్బాలతో పాత బస్టాండ్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. వారి వద్దనున్న పెట్రోల్‌ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement