మాచారెడ్డి : యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని విత్తన మేళాను ప్రారంభించారు. పాల్వంచ మండలం ఎల్పుగొండలో యూరియా నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాలలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలన్నారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. యాప్‌లో బుక్ చేసిన అనంతరం రెండు రోజుల వరకు ఎరువుల బస్తాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతులు ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మట్టిలో తగిన తేమ ఏర్పడిన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. తొందరపడి విత్తనాలు చల్లకుండా, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి మోహన్, ఏడీఏ అపర్ణ, తహసీల్దార్ సరళాబాయి, ఎంపీడీవో గోపీబాబు, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, ఏఈవో రవి, వివిధ గ్రామ సర్పంచులు తదితరులు ఉన్నారు.


