నృత్యప్రదర్శనకు వెళ్తూ.. అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

నృత్యప్రదర్శనకు వెళ్తూ.. అనంతలోకాలకు..

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్‌మాస్టర్‌ మృతి

నిజామాబాద్‌ రూరల్‌ మండలం

గాంధీనగర్‌లో ఘటన

బాన్సువాడ: నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లిన ఓ డ్యాన్సర్‌ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన అన్నం అనిల్‌(34) డ్యాన్స్‌ మాస్టార్‌గా జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్‌లో తన డ్యాన్స్‌ ప్రదర్శన ఇవ్వడానికి మంగళవారం ఉదయం బాన్సువాడ నుంచి బైక్‌పై బయలుదేరాడు. నిజామాబాద్‌ రూరల్‌ మండలం గాంధీనగర్‌ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో అనిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

బాన్సువాడలో విషాదఛాయలు..

అనిల్‌ స్వగ్రామం బోర్లం కాగా, సుమారు 20 ఏళ్ల క్రితం బాన్సువాడకి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్ల క్రితం బోధన్‌ మండలం ఎరాజ్‌పల్లికి చెందిన సిరిని పెళ్లి చేసుకున్నాడు. అనిల్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పట్టణంలోనే నటరాజ్‌ నాట్య మండలిని ఏర్పాటు చేసి చిన్నారులతోపాటు, యువతీయువకులకు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చారు. బాన్సువాడ, నిజామాబాద్‌తోపాటు రాష్ట్రస్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. తన డ్యాన్స్‌తో అందరి మన్ననలు పొందిన అనిల్‌ మృతి కళారంగాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. బాన్సువాడలోని కుటుంబసభ్యులతోపాటు అభిమానులు, స్నేహితులు అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంత్యక్రియలకు వందలాది మంది బంధువులు, అభిమానులు, యువకులు, కళాకారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement