ఎల్లారెడ్డిరూరల్: ఇటీవల తప్పిపోయిన ఓ వ్యక్తి కుళ్లిన స్థితిలో శవమై కనిపించాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడకు చెందిన బంగారు శంకర్(48) మూడు రోజుల క్రితం అన్నాసాగర్ గ్రామంలో పని నిమిత్తం వచ్చాడు. తిరిగి అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి శివారులో మంగళవారం ఉదయం కుళ్లిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు బంగారు శంకర్‌గా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతుడిని శంకర్‌గా గుర్తించారు. మృతుడు మద్యం మత్తులో పడిపోయి మృతిచెందినట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధం
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని సాతెల్లిలో మంగళవారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి పలువురి గుడిసెలు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారి వినోద్ తెలిపారు. సాతెల్లికి చెందిన కల్లేటి మైసయ్య ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మైసయ్య గుడిసెతోపాటు, పక్కన ఉన్న కుంట్ల అంజయ్యకు చెందిన గుడిసె, గడ్డివాము దగ్ధమైనట్లు వారు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.


